కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో కార్లు మరింత ఖరీదైనవిగా మారుతాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇది వాహన తయారీదారుల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరుగుతున్న ముడిసరుకు ధరల కారణంగా వాహనాల ధరలతో ఇబ్బందులు పడుతున్న కంపెనీలపై ఇది మరింత ఒత్తిడిని పెంచుతుందన్నారు. అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ప్రతిపాదనను జారీ చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రోడ్డు భద్రతను పెంచే చర్యల్లో ఒకటన్నారు. కరోనా కారణంగా చిన్న కార్ల అమ్మకాలు ఇప్పటికే గణనీయంగా తగ్గాయని భార్గవ చెప్పారు. పెద్ద కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్ నియమాలను అమలు చేయడం వలన వాటి ధర పెరుగుతుందన్నారు. దీని ప్రభావం చిన్న కార్ల మార్కెట్‌పై ఉంటుందన్నారు. దీంతో వినియోగదారులు ఖరీదైన కార్లను కొనుగోలు చేయలేరన్నారు. దేశంలో తయారయ్యే అన్ని కార్లలో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ఇప్పటికే తప్పనిసరి.
ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ జాటో డైనమిక్స్ ప్రకారం.. మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ధర రూ.17,600 పెరుగుతుంది. కంపెనీలు కారు డిజైన్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నందున కొన్ని సందర్భాల్లో ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుందని జాటో ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు. 2020లో భారతదేశంలో 3,55,000 రోడ్డు ప్రమాదాల్లో 1,33,000 మంది మరణించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కార్లలో తగినంత ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటే ఈ మరణాలలో 13 శాతం రక్షించవచ్చు. దీంతో రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త ఎయిర్ బ్యాగ్స్ నిబంధన పట్ల మొండిగా వ్యవహరిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..