రాజస్థాన్ సికార్ జిల్లా ఫతేపూర్ షెకావతిలోని ఓ వంతెనపై ఆదివారం ఘోర ప్రామాదం చోటు చేసుకున్నది. కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. వంతెనపై ముందు వెళ్తున్న లారీని… వేగంగా వస్తున్న కారు వెనుక వైపు నుంచి ఆ లారీని ఢీ కొట్టింది. ఈ క్రమంలో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. కారులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాంప్రతాప్ బిష్ణోయ్ మాట్లాడుతూ… కారులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని తెలిపారు. సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిసార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ట్రక్కులో చెలరేగిన మంటలను కూడా అదుపులోనికి తెస్తున్నామని, అందులో పత్తి (కాటన్) లోడ్ ఉందని ఆయన వివరించారు.