Saturday, November 23, 2024

Delhi | ఏపీఎఫ్‌డీసీకి క్యాపెక్సిల్ టాప్ ఎక్స్‌పోర్ట్ అవార్డు.. రాష్ట్ర ఎగుమతుల్లో 15.31% వృద్ధి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ఎర్ర చందనం ఎగుమతులకు గాను ప్రతిష్టాత్మక క్యాపెక్సిల్ టాప్ ఎక్స్‌పోర్ట్ అవార్డు అందుకుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ క్యాపెక్సిల్ అందించిన ఈ అవార్డును ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ – చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సంయుక్తంగా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిపిన ఎర్ర చందనం ఎగుమతులకు ఈ అవార్డు దక్కింది.

దుంగల రూపంలో ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఏపీఎఫ్‌డీసీ, ఇప్పటి వరకు రూ. 2,003 కోట్ల విలువైన 6,572 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతి చేసినట్టు సంస్థ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరో రూ. 2 వేల కోట్ల విలువైన 5,353 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

- Advertisement -

2023 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 218 కోట్ల విదేశీ మారకం వచ్చిందని, మరో రూ. 250 కోట్ల విదేశీ మారకం ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మరోవైపు డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి త్రీ స్టార్ ఎక్స్‌పోర్ట్ హౌజ్ ర్యాకింగ్ కూడా తమ సంస్థకు దక్కిందని వెల్లడించారు. ఎగుమతులతో పాటు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఎకో-టూరిజం ప్రాజెక్టులను చేపట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగుమతుల్లో 15.31% వృద్ధి రేటు నమోదైందని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement