Saturday, September 21, 2024

TG | ప్రభాస్ లేకుండా బాహుబలిని ఊహించలేము : సీఎం రేవంత్

హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్షత్రియులు గెలుపుకు, నమ్మకానికి మారుపేరని అన్నారు. క్షత్రియులు కష్టపడే గుణం కార‌ణంగా ఎక్కడైనా విజయం సాధించవచ్చన్నారు.

ఇదే సామాజికవర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. ప్రపంచాన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమ వైపు తిప్పింది మన బాహుబలి అని.. ప్రభాస్ లేకుండా బాహుబలిని ఊహించలేము అని తెలిపారు. ఈ సందర్భంగా దివంగత నటుడు కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

”నాకంటే గొప్పవాళ్లు వేదిక ముందు వినయంగా ఉన్నారు. అదీ క్షత్రియుల గొప్పతనం, కొంపల్లిని పెద్ద నగరంగా చేసింది క్షత్రియులే. మీడియాలో కూడా రాజులే రాణిస్తున్నారు. వారు ఏ రంగంలోకి వచ్చినా రాణిస్తారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేం. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. బాలీవుడ్లో సత్తా చాటిన దర్శకుడు రామ్గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు. హాలీవుడ్ రేంజ్ సినిమా బాహుబలిని ప్రభాస్ లేకుండా ఊహించలేం.

విశ్రాంత ఐఏఎస్ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించాం.. వారి ద్వారా మీరు నన్ను కలవొచ్చు. అల్లూరి సీతారామరాజు, కుమరం భీం స్ఫూర్తితో కొన్నేళ్లుగా పోరాడి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టండి.. మా ప్రభుత్వ సహకారం ఉంటుంది. క్షత్రియ భవన్ కోసం తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. మళ్లీ క్షత్రియ భవన్లో కలుద్దాం” అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement