మేడ్చల్, ప్రభన్యూస్ : మార్కెట్‌లో నిత్యావసర సరుకులు ఆకాశాన్నింటాయి.. సలసల కాగుతున్న మంచి నూనెల ధరలు.. వెరసి వీటి ధరలు ఆకాశాన్నంటాయి.. దీనికి తోడు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొని తినలేని పరిస్థితి.. అయితే గత కొన్ని రోజులుగా కూరగాయలను కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచి వ్యాపారులు అమ్ముతున్నారు. అయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసం మొదలుకొని సంక్రాంతి పండుగ వరకు కూరగాయల ధరలు తక్కువగా ఉండేవి. అయితే సంవత్సరం మార్చి మాసం నుంచే కొండెక్కి కూర్చున్నాయి. అయితే ప్రస్తుతం మూర్కెట్‌కు రూ.500 తీసుకు వెళ్లినా.. సంచిలో కూరగాయలు రాకపోవడంతో సామాన్య, మద్య, పేద వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదంతటికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల సాగు చేయకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో కూరగాయ ధరలు పెంచి అమ్మాల్సి వస్తోందని వ్యాపాలరులు పేర్కొంటున్నారు.
కూరల రారాజు వంకాయ..
కూరగాయల్లో రారాజు వంకాయ అంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ముళ్లు లేని వంకాయ సైతం ప్రజల చేతికి ధరల రూపంలో గుచ్చుకోంటోంది. ప్రస్తుతం కిలో వంకాయ ధర రూ.80 పలుకుతోంది. అదే విధంగా క్యారెట్,
బీర్నీస్, బీరకాయతో పాటు పలు రకాల కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.
నిత్యావసర ధరలు పైకీ..
ప్రజలు నిత్యం వాడుకునే టమాటాలు, ఉల్లిగడ్డ, ఆకు కూరలు, ఎల్లిగడ్డల ధరలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఏ వంట చేసిన ఉల్లిగడ్డ మాత్రం తప్పనిసరిగా వాడుతారు. ఉల్లిగడ్డ ధర ప్రజలకు అందుబాటులో ఉండడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి నూనే ధరలు రూ.200ల నుంచి రూ.210కి చేరడం దీనికి తోడు పప్పుల ధరలు సైతం పెరిగిపోవడంతో మహిళలు వంటలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
15 రోజుల్లో పెరిగిన ధరలు..
నెల రోజుల క్రితం కూరగాయల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండగా, ఏప్రిల్ మాసంలో పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య కుటుంబాల ప్రజలకు నెలకు అదనంగా మరో రూ.1500 ల వరకు భారం పడుతుంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం పెరుగుతున్న కూరగాయల ధరలను నియంత్రించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..