Tuesday, November 26, 2024

నోటిఫికేషన్లు పడుతున్నా ఓటీఆర్‌ నమోదుకు ఆసక్తి చూపని అభ్యర్థులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుంటేనేమో వేయలేదని ప్రభుత్వాన్ని నిందించడం… తీరా వేశాక.. ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శించడం నేటి ఉద్యోగార్థుల తీరుకి ఇది నిదర్శనంగా కనబడుతోంది. వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించ కూడదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, టీఎస్‌పీఎస్సీ నుంచి మొదట గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడబొతోందన్న విషయం ముందే అందరకీ తెలుసు. దాదాపు 11 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 ప్రకటన వెలువడుతున్నప్పుడు, దీనికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఓటీఆర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా తర్వాత చేసుకుందాములే అనే వేచి చూసే ధోరణీలో అభ్యర్థులు ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఈక్రమంలోనే ఓటీఆర్‌ చేసుకునే వారి సంఖ్య ప్రతి రోజూ చాలా తక్కువగా నమోదవుతోంది. గ్రూప్‌-1 పోస్టులకే కాకుండా త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా వెలువడే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందు ఓటీఆర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న వారైతేనేమో ఓటీఆర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. చేసుకోని వారైతే కొత్తగా ఓటీఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ ద్వారా మొత్తం 25.46 లక్షల మంది నిరుద్యోగులు ఓటీఆర్‌లో నమోదై ఉన్నారు. అయితే ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు, జోన్ల పరిధి మారడం వంటి కారణాల రిత్యా పాత అభ్యర్థులు (25.46 లక్షలు) సైతం మళ్లిd తమ వివరాలను ఓటీఆర్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడూ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా ఓటీఆర్‌ ద్వారా వివరాలను పొందుపర్చాల్సి ఉంది. దీనికి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించినప్పటికీ అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన రావడంలేదు. ఇప్పటి వరకు కేవలం 2,32,724 మంది మాత్రమే ఓటీఆర్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇందులోనూ పాత అభ్యర్థులు 1,60,488 మందికాగా, కొత్త అభ్యర్థులు 72,236 మందే ఉన్నారు. అంటే 25లక్షల మంది అభ్యర్థుల్లో మంగళవారం సాయంత్రం వరకు 9.3 శాతం మంది మాత్రమే ఓటీఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కనీసం 10 శాతం మంది అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు తమ వివరాలను నమోదు చేసుకోకపోవడం గమనార్హం.

చివరి నిమిషంలో హడావుడి…

గ్రూప్‌-1కు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈనెల 31వరకు చివరి గడువు ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఓటీఆర్‌కే కాదు గ్రూప్‌-1 దరఖాస్తు చేసుకోవడంలోనూ ఉద్యోగార్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడంలేదు. 24.46 లక్షల మందిలో అందరూ గ్రూప్‌-1కే దరఖాస్తు చేసుకోరు. కానీ తరువాత టీఎస్‌పీఎస్సీ ద్వారా వెలువడే గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లప్పుడైనా ఓటీఆర్‌ చేసుకోకతప్పదు. కానీ చాలా మంది ఉద్యోగార్థులు ఇప్పుడేం చేద్దాములే…తర్వాత చేసుకోవచ్చనే ధోరణీలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. చివరి నిమిషం వరకు వేచి చూసి ఆ తర్వాత హడావుడిగా చేసేవారు చాలా మంది ఉంటారు. ఇలా చివరి నిమిషం వరకు వేచి చూడడం ద్వారా వెబ్‌సైట్‌పై విపరీతమైన ఒత్తిడి పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కొల్పోవడే కాకుండా తప్పులు దొర్లే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు వెంటనే తమ వివరాలను ఓటీఆర్‌ ద్వారా నమోదు చేసుకోవాలని కమిషన్‌ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాలు, జోన్లు అమల్లోకి వచ్చినందున అభ్యర్థులు తమ వివరాలను మరోకసారి పొందుపర్చాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేస్తోంది.

గ్రూప్‌-1కు 11,598 దరఖాస్తులు…

- Advertisement -

రెండో రోజు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకునేవాళ్ల సంఖ్య కాస్త పెరిగింది. మొదటి రోజు 3వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా రెండో రోజు మంగళవారం నాడు 11,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 31 వరకు గడువు ఉండడంతో క్రమంగా దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రూప్‌-1కు 9 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచానా వేస్తున్నారు. గ్రూప్‌-1లోని 503 పోస్టుల్లో మహిళలకు 225 (33శాతం) పోస్టులను రిజర్వు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జోన్లు, జిల్లాలు, రోస్టర్‌ కారణంగా వాటికి రిజర్వు చేసిన పోస్టుల కంటే ఎక్కువగా పోస్టులు మహిళలకే దక్కనున్నట్లు చర్చ జరుగుతోంది.

వారు ఎన్‌వోసి ఇవ్వాల్సిందే…

ఇప్పిటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు సైతం గ్రూప్‌-1కు పోటీ పడుతున్నారు. కోచింగ్‌లు తీసుకొని మరీ సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగంలో ఉన్న వారు దరఖాస్తు చేసుకొని వీరంతా పరీక్ష రాయాలంటే మాత్రం తమ శాఖాల నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ)ను సమర్పించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement