Saturday, November 23, 2024

Delhi | మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్ చికిత్స.. ఎంపీ బాలశౌరి ప్రశ్నలకు కేంద్రం బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్ చికిత్సకు ఆమోదం లభించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ఆయన అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా సమాధానమిచ్చారు. దేశంలో క్యాన్సర్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయని, ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే అత్యధిక క్యాన్సర్ కేసులున్నాయని చెప్పుకొచ్చారు.

2022లో 14.61 క్యాన్సర్ కేసులుండగా.. 2025 నాటికి అవి 15.7 లక్షలకు చేరుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు. కేసుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నాయన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ (2,10,958), మహారాష్ట్ర (1,21,717), పశ్చిమ బెంగాల్ (1,13,581), బీహార్ (1,09,274), తమిళనాడు (93,536) రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని చెప్పారు.

క్యాన్సర్ కారకాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం, అనారోగ్యకర ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం, వాయు కాలుష్యం ప్రధానమైనవని, క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రాలకు కేంద్రం సాంకేతిక, ఆర్థిక సహాయం అందజేస్తోందని మన్సూఖ్ మాండవియా వివరించారు. వైద్య మౌలిక వసతులను పెంపొందించడం, వైద్య సిబ్బంది, ఆరోగ్యకర జీవనం గురించి ప్రచారం, 30 ఏళ్లు దాటినవారికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రారంభ దశలో గుర్తించి నియంత్రించడం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.

గ్రామీణ స్థాయిలో క్యాన్సర్‌పై అవగాహన కల్గించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి వివరించారు. ఏపీలో కర్నూలు మెడికల్ కాలేజీలో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉందని ఆయన అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement