హైదరాబాద్, ఆంధ్రప్రభ : క్యాన్సర్ అనే వ్యాధి పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. చికిత్స తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో, అసలు ప్రాణాలతో ఉంటామో కూడా చెప్పలేం.
ఇలాంటి భయంకరమైన వ్యాధిపై ఇప్పటికీ ప్రజల్లో అవగాహన అంతంత మాత్రమేనని పలు వైద్య అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరీ బాధాకరమైన విషయం ఏమంటే ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. పురుషులలో అత్యంత సాధారణమైన క్యాన్సర్ రకాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వ్యాప్తిలో ఉన్నాయి.
కొద్ది కాలం క్రితం వరకు గుండె, అంటు వ్యాధులతో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించేవి.. కానీ ఇప్పుడు క్యాన్సర్‌తో అధిక మరణాలు సంభవిస్తున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న 2025 నాటికి దాదాపు 10 మిలియన్ల మరణాలు లేదా ప్రపంచవ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు క్యాన్సర్‌తో మరణిస్తారని వైద్య సర్వేలు తేల్చి చెబుతున్నాయి. భారతదేశంలో, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ మరియు రొమ్ము క్యాన్సర్లు అత్యంత ప్రాణాంతకమైనవిగా పరిణమిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణతోపాటు దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో 80శాతం ఊపిరితిత్తుల వ్యాధి గ్రస్థులు పొగ పీలుస్తున్న వారే ఉన్నారు. ధూమపానం మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను మానేయడం వల్ల క్యాన్సర్ రేటు- గణనీయంగా తగ్గుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, ఊబకాయం, మద్యపానం మరియు వ్యాయామం లేకపోవడం వంటివి కూడా క్యాన్సర్ మరణాలకు దారితీస్తున్నాయి.
సామాజిక ఆర్థిక స్థితి, జాతి లేదా ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సకాలంలో, అధిక-నాణ్యతతో కూడిన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని పలు వైద్య సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. క్యాన్సర్ బారిన పడిన రోగలు ఉన్న కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా నష్టపోతున్నాయి.