Friday, November 22, 2024

కాంగ్రెస్‌కు కేన్సర్ సోకింది.. హోంగార్డు పార్టీ వీడితే పోయేదేం లేదు: మర్రి శశిధర్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం కాని స్థితికి చేరుకుందని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన తర్వాత శనివారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. పార్టీ సీనియర్లను హోంగార్డుతో పోల్చుతూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ “ఒక హోంగార్డు పార్టీ వీడితే పోయేదేమీ లేదు” అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో పార్టీ సీనియర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే.. ఎవరికీ అందుబాటులో ఉండరని, భజనపరులను పెట్టి పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల్లో తాను రూ. 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, ఇంచార్జులుగా నియమించినవారితోనే ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశారని అన్నారు. ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనంటూ బెదిరించారని ఆరోపించారు. ఇక ఎన్నికల ఫలితాలను చూస్తే.. 3 వేల ఓట్ల నుంచి 20 వేల ఓట్లు దాటితే అదే ఘనకార్యం అన్నట్టుగా సంబరపడుతున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

నిజానికి రేవంత్ రెడ్డికి పార్టీని గెలిపించాలన్న లక్ష్యం, ఉద్దేశం ఏదీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం తనతో పాటు ఓ 15 మంది గెలిస్తే చాలు.. సొంత దుకాణం పెట్టుకోవచ్చు అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులు సైతం పీసీసీ అధ్యక్షుడి చెప్పు చేతల్లోనే ఉన్నారని, మిగతా నేతల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని అన్నారు. కొందరు నేతలు అవమానాలు భరిస్తూ మౌనంగా ఉన్నారని, తాను అలా ఉండలేకనే బయటికి వచ్చేస్తున్నానని చెప్పారు. ఇక బీజేపీలో తన చేరిక గురించి చెబుతూ ఒకట్రెండు రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని ఢిల్లీలోనే పార్టీలో చేరతానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement