Tuesday, November 19, 2024

హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ సర్వీసులు రద్దు.. అత్యవసరమైతే ఖమ్మం మీదుగా మళ్లింపు

అమరావతి, ఆంధ్రప్రభ: ; మున్నేరు వరద నీరు జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో విజయవాడ- హైదరాబాద్‌ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు ఆపేశారు. ఎన్‌టీఆర్‌ జిల్లా ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. అక్కడి పరిస్థితుల నేపధ్యంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసులు ఆపేశారు. పోలీసు అధికారుల సూచన మేరకు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను గురువారం సాయంత్రం నుంచి అధికారులు ఆపేశారు. అత్యవసరమైతే ఖమ్మం మీదుగా సూర్యాపేట నుంచి ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

65వ నంబర్‌ జాతీయ రహదారిపై విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రోజుకు ఐదొందల వరకు ఆర్టీసీ సర్వీసులు నడుస్తుంటాయి. ఒక్క విజయవాడ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ సర్వీసులు విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణికులను చేరవేస్తుంటాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కురిసిన భారీ వర్షాలకు వరద నీరు జాతీయ రహదారి పైకి వచ్చి చేరింది. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌-విజయవాడ రహదారిపైకి వరద నీరు చేరినట్లు అధికారులు చెపుతున్నారు.

2005లో చివరిసారిగా విజయవాడ-హైదరాబాద్‌ రహదారిపైకి వరద నీరు వచ్చింది. సాయంత్రం ప్రయాణికులతో వెళ్లిన బస్సులను ఐతవరం వద్ద ఆపేసి మదిర-ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ వైపు పంపారు. ఆపై సాయంత్రం 4.45 గంటల నుంచి విజయవాడ నుంచి వెళ్లే అన్ని ఆర్టీసీ సర్వీసులను అధికారులు ఆపేశారు. హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికుల నుంచి డిమాండ్‌ వ్యక్తమైన పక్షంలో తిరువూరు-ఖమ్మం-సూర్యాపేట మీదుగా బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ ప్రయాణికులకు బస్సులు పునరుద్ధరించే వరకు సర్వీసులు నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement