Wednesday, November 20, 2024

రేప‌టినుంచి కెనడా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌.. పీవీ సింధు, లక్ష్యసేన్‌ ఫామ్‌పై ఆందోళన

భారత స్టార్‌ షట్లర్లు పివి సింధు, లక్ష్యసేన్‌ ఫామ్‌కోసం తంటాలు పడుతున్నారు. ఒలింపిక్‌ క్వాలి ఫికేషన్‌ సైకిల్‌ ప్రారంభమైన నేపథ్యంలో, ర్యాంకింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టిసారించారు. రేప‌టి నుంచి కాల్గరీలో జరిగే కెనడా ఓపెన్‌ వరల్డ్‌టూర్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నారు. మాజీ ప్రపంచ ఛాంపియన్‌, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత అయిన పీవీ సింధు గాయం నుండి తిరిగి వచ్చిన తరువాత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం బిడబ్ల్యుఎఫ్‌ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయింది.

గతేడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన తన తొలి కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణం గెలుచుకునే మార్గంలో ఒత్తిళ్లను ఎదుర్కొన్న 27 ఏళ్ల సింధు పూర్తి ఫిట్‌నెస్‌ను పొందేందుకు ఇప్పటికీ పోరాడుతోంది. ఆమె ఫిబ్రవరిలో దోహాలో జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. కానీ ఈఏడాది కొన్ని ఇంటర్నేషనల్‌ టోర్నీలకు దూరమైంది. ఏప్రిల్‌లో మాడ్రిడ్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా, ఆ తర్వాత జరిగిన రెండు టోర్నీల్లో మొదటి రౌండ్‌లో నిష్క్రమించింది. మరొకదానిలో రెండవ రౌండ్‌లో ఓడిపోయింది.

- Advertisement -

సులభమైన డ్రా.. కఠిన ప్రత్యర్థులు..

సింధు ఓపెనింగ్‌ రౌండ్‌లో సులభమైన డ్రాను పొందింది. స్థానిక ఛాలెంజర్‌ టాలియా ఎన్‌జిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎనిమిదో సీడ్‌ జపాన్‌కు చెందిన నొజోమి ఒకహారాపై సింధు 9-8 లీడ్‌ను కలిగివుంది. మొదటి రెండు రౌండ్లను అధిగమిస్తే, క్వార్టర్‌ ఫైనల్స్‌లో వీరిద్దరు తలపడే చాన్సుంది. అలాగే, టాప్‌ సీడ్‌ అకానె యమగుచిపైనా 14-10 ఆధిక్యాన్ని కలిగివుంది. అయినప్పటికీ, గత నెలలో జరిగిన సింగపూర్‌ ఓపెన్‌లో సింధును జపాన్‌ క్రీడాకారిణి ఓడించింది.

లక్ష్యసేన్‌దీ అదే వ్యధ..

కామన్వెల్త్‌ గేమ్స్‌ ఛాంపియన్‌ లక్ష్య సేన్‌ కూడా ఈ ఏడాది మొదటి రౌండ్‌ నిష్క్రమణలతో టాప్‌ 10 ర్యాంక్‌ నుంచి నిష్క్రమించాడు. ప్రస్తుతం 19ర్యాంక్‌లో ఉన్న సేన్‌ జనవరిలో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్‌లో క్వార్టర్‌-ఫైనల్‌కు చేరుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ, నాలుగు ఈవెంట్‌లలో మొదటి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గత ఆగస్టులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తర్వాత ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న సేన్‌ ఫామ్‌ను తిరిగి పొందేందుకు తంటాలు పడుతున్నాడు. శస్త్ర చికిత్స అనంతరం ఎనిమిది నెలల పాటు తరచూ అనారోగ్యం, అలర్జీలతో బాధపడుతున్నాడు.

సింధులా కాకుండా, సేన్‌ ప్రారంభ రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రెండవ-సీడ్‌ కున్లావుట్‌ విటిడ్‌సర్న్‌తో కఠిన సవాల్‌ ఎదురవనుంది. థాయ్‌ షట్లర్‌ గతేడాది టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. మూడుసార్లు జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాచాడు. ఇక పురుషుల డబుల్స్‌లో భారత్‌కు కృష్ణ ప్రసాద్‌ గరగా, విష్ణువర్ధన్‌ పంజాల సారథ్యం వహిస్తున్నారు. వీరు ఫ్రాన్స్‌కు చెందిన జూలియన్‌ మైయో – విలియం విల్లెగర్‌లపై తమ ప్రారంభ గేమ్‌ను ఆడబోతున్నారు. గత నెలలో జరిగిన తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 ఈవెంట్‌లో భారత జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరుత్సాహపరిచింది. ఈసారి ఆలోటును భర్తీ చేయాలనే పట్టుదలతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement