ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్న యువతపై ఇటీవల దాడులు పెరిగాయి. మరీ ముఖ్యంగా చాలా మంది భారతీయులు ఉన్నత చదువుల కోసం ఆమెరికా వెళ్తున్నారు. అక్కడ విద్యార్థులపై దాడులు జరగడమే కాకుండా హత్యలకు గురవుతున్నారు. తాజాగా కెనడాలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.
కెనడాలోని వాంకోవర్లో చిరాగ్ అంటిల్ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్ వాంకోవర్ పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈ నెల 12వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం రాగానే వారు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే కారులో చిరాగ్ విగత జీవిగా పడి ఉండటం కనిపించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వాంకోవర్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.