Friday, November 22, 2024

వ్యవసాయ శాఖ సేవలకు కాల్‌ సెంటర్‌.. రైతులకు మేలైన‌ సేవలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతుల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కల్గుకుండా ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో అందుబాటులోకి టోల్‌ ఫ్రీ నెంబర్‌ తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కాల్‌ సెంటర్‌ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సేవల పరిశీలనకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుబంధు, రైతు బీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువవుతామని ప్రకటించారు.

ఈ సందర్భంగా కాల్‌ సెటర్‌ పనితీరును తెలుసుకుని, తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్‌ పరిధిలో మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబుతో రైతు బీమా అందిన వివరాలను కాల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి దైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ చొరవతో రైతుబీమా ద్వారా అందిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. రైతు బీమా సొమ్ము మీ కుటుంబానికి భరోసా ఇస్తుందని భావిస్తున్నామని వారితో అన్నారు. త్వరలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి జమ చేయనున్నామన్నారు. ఎప్పటిలాగానే యధావిధిగా రైతుబంధు నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, శాసనమండలి సభ్యులు ఎల్‌రమణ పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement