Wednesday, November 20, 2024

బీర్‌భూమ్‌ దుర్ఘటనపై సూమోటోగా కేసు, 24 గంటల్లో నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు ఆదేశం

కోల్‌కతా:ఎనిమిదిమంది సజీవ దహనం దుర్ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీకి చెందిన ప్రతినిధి బృందం సంఘటన స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించాలని సూచించింది. ఏ ఒక్క ఆధారమూ విధ్వంసానికి గురికాకూడదని, ఆ గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడి, సాక్షుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ విషయంలో జిల్లా కోర్టు, డీజీపీలను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప.బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లా రామపుర్హత్‌లో ఇళ్లకు నిప్పంటించడంతో ఎనిమిది మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.

రాజకీయ కక్షతో అధికార పార్టీకి చెందినవారే ఈ హత్యలకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదంతంపై సూమోటోగా కేసు విచారించిన హైకోర్టు క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆదేసిస్తూ సంఘటనా స్థలంలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తికానట్టయితే, చేసినప్పుడు వీడియో రికార్డ్‌ చేయాలని సూచించింది. తృణమూల్‌ పార్టీ సానుభూతిపరుడైన ఓ పంచాయతీ అధికారి భాదు ప్రధాన్‌ హత్య నేపథ్యంలో కొంతమంది మంగళవారం కొందరి ఇళ్లకు నిప్పుపెట్టడంతో ఎనిమిదిమంది సజీవదహనమైనారు. ఈ కేసును కలకత్తా హైకోర్టు సూమోటోగా విచారణకు స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాత్సవ, జస్టిస్‌ రాజర్షి భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 22మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా మూడురోజుల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దారుణమే.. కానీ ఆ రాష్ట్రాల్లోనూ జరిగాయి :మమత
బీర్‌భూమ్‌లో జరిగిన సజీవదహనం దుర్ఘటన బాధాకరమేనని, ఈ పరిణామం మంచిదికాదని, అయితే ఇలాంటివి బీజేపీ పాలిత గుజరాత్‌లోను, రాజస్థాన్‌లోను గతంలో అనేకం జరిగాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నామని, ఈ దుర్ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని, సంఘటనా స్థలాన్ని గురువారం సందర్శిస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పతి పాలన విధించాలని, కేంద్రం దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుండగా ఆ హత్యలతో తమకు సంబంధం లేదని తృణమూల్‌ అంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement