కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు మోడీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం.
ఇక కేంద్ర కేబినెట్‌ను నేడు విస్తరించనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం ఏడుగురు లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగువాడైన జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో కలుపుకుంటే మొత్తం 8 మంది తెలుగు వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి లభించింది. దీంతో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరికి కేబినెట్ బెర్తులు దక్కొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీలో చేరినప్పుడు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్న కర్నూలు నేత టీజీ వెంకటేశ్‌కు రాత్రి వరకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ఇక ఆశలు లేనట్టే. సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వేర్వేరు పనుల నిమిత్తం ఢిల్లీలోనే ఉన్నారు.
ఇక, ఏపీలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఆ రాష్ట్రానికి ఎలాంటి పదవులు దక్కకపోవచ్చు. కేబినెట్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలనుకుంటే కనుక సోయం బాపూరావుకు అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనకు కూడా అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: మినరల్ వాటర్ తాగొచ్చా..?