న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. అంతా అనుకున్నట్టే జరిగితే రేపు (బుధవారం) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కేంద్రం చేపట్టనున్నట్టు రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బుధవారం లేదంటే ఈ నెల 18 తర్వాతనే ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఈసారి పునర్వ్యవస్థీకరణలో ఏకంగా 22 మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన విధంగా, పలు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులను పంపించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్‌లలో ఒకరిని పంపే అవకాశం ఉంది.
ఇద్దరిలో నరేంద్ర సింగ్ తోమర్ గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. కేంద్ర మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఆయనకు ఇప్పుడు మరింత కలిసిరానుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల సొంత రాష్ట్రం గుజరాత్‌కు కూడా కేంద్ర మంత్రులను రాష్ట్ర అధ్యక్షులుగా పంపించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల్లో డా. మన్సుఖ్ మాండవియా లేదా పురుషోత్తం రూపాలాను రాష్ట్రానికి పంపించనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సీఆర్ పాటిల్ పదవీకాలం ముగిసి కూడా చాలా రోజులైంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాధ్యుక్షుడి మార్పు అనివార్యంగా మారింది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలోనూ కొత్త అధ్యక్షుడి నియామకం తప్పనిసరైంది.
కేంద్ర మంత్రిగా ఉన్న శోభ కరంద్లాజే లేదంటే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశ్వత్ నారాయణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితో పాటు బిహార్, బెంగాల్, ఒడిశా సహా మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చేందుకు కసరత్తు జరిగింది. ఒడిశాకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా పంపించవచ్చని సమాచారం. మరికొందరు కేంద్ర మంత్రులను నేరుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సేవలకు వినియోగించుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఉన్నారని సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, ఎస్. జైశంకర్ వంటి కొందరు ముఖ్యమైన మంత్రులు మినహా కేబినెట్‌లో దాదాపు పూర్తిస్థాయి ప్రక్షాళన జరగనున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇంత పెద్దస్థాయిలో కేంద్ర మంత్రివర్గం ఖాళీ అయినప్పుడు ఆ మేరకు భర్తీ చేయక తప్పదు. పైగా ఎన్నికల ఏడాది కాబట్టి మరింత దూకుడుగా, సమర్థవంతంగా పనిచేసేవారికే బాధ్యతలు అప్పగించాలని ప్రధాన మంత్రి భావిస్తారు. ఆ దిశగా అధినేతలు ఇప్పటికే విస్తృతంగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మిజోరాం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ ఓటుబ్యాంకుపై దృష్టి పెట్టిన కమలనాథులు ఈసారి కూడా కేబినెట్‌లో ఆ మేరకు సమీకరణాల లెక్కలు వేసుకుంటారని తెలుస్తోంది.
2021 జులైలో జరిపిన గత విస్తరణలో ప్రకాశ్ జవడేకర్, రవిశంకర్ ప్రసాద్, డా. హర్షవర్థన్ వంటి సీనియర్లు సహా మొత్తం 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తగా శర్బానంద్ సోనోవాల్, అశ్విని వైష్ణవ్ వంటి వారితో కలిపి మొత్తం 17 మందికి చోటు కల్పించారు. ఇదే కసరత్తులో అప్పటి వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నేరుగా కేబినెట్ ర్యాంకుకు పదోన్నతి కల్పిస్తూ పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలకు అప్పగించారు. మొత్తంగా భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించిన ఘనత తమదేనంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈసారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీ, తెలంగాణకు వాటా ఎంత?
ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం కిషన్ రెడ్డి మాత్రమే ఉండగా.. ఉన్న ఆ ఒక్క మంత్రికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ నుంచి లోక్‌సభకు గెలిచినవారిలో నలుగురు బీజేపీ నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభలో ప్రాతినిథ్యం లేదు. రాజ్యసభ సభ్యుల్లో తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు, తెలంగాణకు చెందిన డా. కే. లక్ష్మణ్ ను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు బీజేపీ అధిష్టానం పంపించింది.
అంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిలో కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులుగా పంపిన నేపథ్యంలో మిగిలి ఆరుగురిలో ఎవరికి చోటు కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కమలనాథుల దృష్టి ప్రస్తుతం తెలంగాణ మీదనే ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదల వారిలో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ విస్తృతంగా జరిగింది. తెలంగాణలో పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన బండి సంజయ్ తొలగింపును ఇప్పటికే పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వారిని శాంతింపజేయడం కోసమైనా బండి సంజయ్‌కు కనీసం సహాయ మంత్రి పదవినైనా ఇస్తారని భావిస్తున్నారు. కిషన్ రెడ్డి నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతల్ని ఇప్పుడు బండి సంజయ్‌కు అప్పగించి, తెలంగాణ రాష్ట్ర పర్యటనలో పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేని ప్రొటోకాల్ కల్పిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.
ఒకవేళ బండి సంజయ్‌కు పార్టీలోనే వేరే బాధ్యతలు అప్పగిద్దామని అధిష్టానం భావిస్తే, డా. కే. లక్ష్మణ్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తారు. కాకపోతే ఆయనకు ఇప్పటికే ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్ష బాధ్యతలతో పాటు బీజేపీలో అత్యున్న నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా, బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెంబర్‌గా కూడా నియమించింది. వాటితో పాటు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటును కూడా కట్టబెట్టింది. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవికి కూడా ఆయన్ను పరిగణలోకి తీసుకుంటారా అన్న మీమాంస కూడా రాజకీయవర్గాల్లో నెలకొంది. ఓబీసీ ఓటుబ్యాంకు ద్వారా రాజకీయం చేయాలనుకుంటున్న బీజేపీ, కచ్చితంగా ఆ వర్గానికి చెందిన నేతకే మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రం కాబట్టి మరొక బెర్త్ అదనంగా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా నేతలు అంటున్నారు.
2019లో కొలువుదీరిన ఎన్డీయే-2 ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ప్రాతినిథ్యం లేదు. ఆ రాష్ట్రం నుంచి ఎవరికైనా చోటు కల్పించాలి అనుకుంటే జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్ మాత్రమే మిగిలారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటే ఇద్దరి సామాజికవర్గాలు అల్పసంఖ్యాకులే. ఆ రాష్ట్రంలో ‘కాపు’ ఓట్లను ఆకట్టుకోవాలని చూస్తున్న బీజేపీ, ఆ వర్గానికి చెందిన నేతను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుని, వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అవకాశం కూడా లేకపోలేదు. ఆ సమీకరణాల్లో మిత్రపక్షం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేదంటే ఆయన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మాత్రమే కనిపిస్తున్నారు. ఒకవేళ వైఎస్సార్సీపీలో అసంతృప్తితో ఉన్న రెడ్డి వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. లేదంటే ఆంధ్రప్రదేశ్‌ను ఎప్పటిలాగే వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజ్యసభకు ఏపీ నేత?
కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు లేకపోయినా కనీసం రాజ్యసభకైనా పంపించే అవకాశం ఉందన్న చర్చ కూడా ఢిల్లీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం బెంగాల్‌లో 6, గుజరాత్‌లో 3, గోవాలో 1 స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లోని 6 స్థానాల్లో 4 నుంచి 5 సీట్లు అధికారపక్షం తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్తాయి. అక్కడ ఒకటి కచ్చితంగా బీజేపీ ఖాతాలోకి వస్తుంది. రెండోది బోనస్. గుజరాత్ మూడు సీట్లూ, గోవాలో ఒక సీటు బీజేపీ ఖాతాలోకే వస్తాయి. గుజరాత్ మూడు సీట్లలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారమే నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఇంకో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. గోవాలో ఉన్న ఒక్క సీటును స్థానిక నేతకే ఇస్తారు. బెంగాల్‌లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే గుజరాత్‌లోని మరో రెండు సీట్లలో ఒకటి ఇస్తే తెలుగు నేతకు ఇచ్చే అవకాశం ఉంది. అది ఎవరికి ఇస్తారన్న విషయంపై ఊహాగానాలు విస్తృతంగా చెలరేగుతున్నాయి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని చీల్చుకుని వచ్చి బీజేపీలో చేరిన నేతల్లో తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్ రావు, ఏపీ నేతల్లో కేంద్ర మాజీ మంత్రి వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), టీజీ వెంకటేశ్ ఉన్నారు. ఈ ముగ్గురూ ఎవరికివారుగా రాజ్యసభ పదవి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
కొందరైతే ఏకంగా పార్టీ అధిష్టానం పెద్దలను భోజనాలకు ఆహ్వానించి మరీ పదవి కోసం పట్టుబడుతున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కాకుండా కొత్త నేతలకు చోటు కల్పించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆ క్రమంలో తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరామ్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు. అంతకంటే ముందు రాజస్థాన్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా పనిచేశారు. బీజేపీ మేధావి వర్గం నేతగా ఆయనకు పేరు, నీటి పారుదల రంగంలో విస్తృత విషయ పరిజ్ఞానం ఉన్నాయి. ఈసారికి రాజ్యసభకు తీసుకుని, వీలుంటే మంత్రివర్గంలో కూడా కల్పించవచ్చన్న చర్చ జరుగుతోంది.