Friday, November 22, 2024

Delhi | చేతివృత్తులకు కేంద్రం చేయూత.. ‘పీఎం-విశ్వకర్మ’ పథకానికి మంత్రివర్గం ఆమోదం


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన ‘పీఎం-విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్) సమావేశంలో రూ. 13 వేల కోట్ల విలువైన ఈ పథకానికి ఆమోదముద్ర పడింది. ఈ పథకాన్ని 5 సంవత్సరాల పాటు (2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గురు-శిష్య పరంపర లేదా చేతివృత్తులు, హస్తకళల నిపుణులకు చేయూతనిస్తూ, వారి వృత్తిలో మరింత ఆదాయం గడించేందుకు తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. చేతివృత్తులను అనుసరిస్తున్నవారు, హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు, సేవల యొక్క నాణ్యతను మెరుగుపర్చడంతో పాటు దేశ, విదేశాల్లో వారు తయారు చేసిన ఉత్పత్తులను చేరవేస్తూ మరింత ఆదాయం గడించేలా వేల్యూ చైన్ రూపకల్పన ధ్యేయంగా ఈ పథకాన్ని కేంద్రం రూపొందించింది.

- Advertisement -

పథకంలో భాగంగా చేతివృత్తుల వారికి, హస్తకళల నిపుణులకు పిఎమ్-విశ్వకర్మ సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు కార్డు, ఒక లక్ష రూపాయల వరకు (మొదటి విడతలో) , రూ. 2 లక్షల వరకు (రెండో విడతలో) ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సహాయం కేంద్రం అందించనుంది. ఈ రుణానికి అత్యల్పంగా కేవలం 5 శాతం వడ్డీరేటు ఉంటుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

చేతి వృత్తులు, హస్తకళల నిపుణులకు ఆయా పనుల్లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలు, పనిముట్లను అందజేయడంతో పాటు వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఆధునిక పనిముట్ల కోసం రూ. 15 వేల ప్రత్యేక ఆర్థిక సహాయం కూడా పథకంలో భాగంగా ఉంటుందని తెలిపింది. అనంతరం వారు రూపొందించిన వస్తువుల విక్రయంలో డిజిటల్ లావాదేవీల నిర్వహణతో పాటు మార్కెటింగ్ సంబంధిత మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వం అందించనుంది.

భారతదేశం అంతటా పల్లెలు, పట్టణాల్లో చేతివృత్తులు, హస్తకళల నిపుణులకు ఈ పథకం దన్నుగా నిలబడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పిఎమ్-విశ్వకర్మలో భాగంగా తొలివిడతలో 18 సాంప్రదాయిక వృత్తులను పరిగణలోకి తీసుకుంది. వాటిలో (1) వడ్రంగులు; (2) పడవల తయారీదారులు; (3) ఆయుధాలు / కవచాల తయారీదారులు; (4) కమ్మరులు; (5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు; (6) తాళాల తయారీదారులు; (7) బంగారంపై పనిచేసేవారు (8) కుమ్మరులు; (9) శిల్పులు (ప్రతిమలు, రాతిపై చెక్కడం పనిచేసేవారు), రాళ్ళను పగులగొట్టే వృత్తిలో ఉండేవారు; (10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు; (11) తాపీ పనివారు; (12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు; (13) కొబ్బరి నారతో వస్తువులను తయారుచేసేవారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు); (14) క్షురకులు (నాయీ వృత్తిదారులు); (15) మాలలు అల్లే వారు; (16) రజకులు; (17) దర్జీలు (18) చేపలను పట్టేందుకు ఉపయోగించే వలలను తయారు చేసేవారు ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement