ఇస్రో ప్రతిపాదనలకు ఆమోదం
గగన్‌యాన్, వీనస్ ఆర్బిటార్ మిషన్‌కు రెడీ
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇస్రో పంపిన ప్రతిపాదలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చంద్రయాన్-4 మిషన్, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, ఎన్‌జీఎల్‌ఏ వాహకనౌక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు నిధులు సైతం కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేబినెట్ చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రో 2026 నాటికి చేపట్టాలని భావిస్తున్నది. రెండు దశల్లో చంద్రయాన్-4 మిషన్‌ను నిర్వహిస్తుంది.
రోవర్ రెడీ చేస్తున్న జపాన్..
రెండుదశల్లో భాగాలను నింగిలోకి పంపి.. ఆ తర్వాత స్పేస్‌లోనే కనెక్ట్ చేయనున్నారు. ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నారు. మిషన్‌లో భాగంగా చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించి.. తిరిగి భూమిపైకి చేరుకుంటుంది. ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్ చరిత్ర లిఖించనున్నది. ఇక భారత్ గగన్ యాన్ ప్రాజెక్టును సైతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఇందులో భాగంగా వ్యోమగాములను నింగిలోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇందు కోసం వ్యోమగాములను సైతం ఎంపిక చేసిన శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భూమికి దగ్గరలో ఉన్న వీనస్‌పై అధ్యయనం చేయనున్నది. ఇందులో వీనస్ వాతావరణంపై పరిశోధనలు జరుపనున్నది. అలాగే, తర్వాతి తరం లాంచ్ వెహికల్‌కు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. తక్కువ భూకక్ష్యలో 30 టన్నుల పేలోడ్‌ను ప్రవేశపెట్టడం దీని లక్ష్యం.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్
కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర లభించినట్లయితే దీంతో ఇక లోక్ సభ, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికోసం 324ఎ, 325 అధికరణలు సవరణ చేయాల్సి ఉంది.. దీనికి కూడా కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చంది..
రామ్‌నాథ్ కోవింద్ కమిషన్ నివేదిక ఇదే..
రామ్‌నాథ్ కోవింద్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఒకేసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మిగతా రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు.