యూపీలో ఓ యువతి క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన ఓ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత అసలు విషయం సీసీఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. ఇన్ని రోజులు క్యాబ్ డ్రైవర్ తప్పు చేయడం వల్లే ఆ యువతి అతన్ని కొట్టిందని అందరు భావించారు. కాని తప్పంతా ఆ యువతిదే అని తాజాగా వెలుగులోకి వచ్చింది.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరి కెమెరాల ఆధారంగా అక్కడేం జరిగిందో మీడియాకు వివరించారు. సిగ్నల్ పడకముందే రోడ్డు క్రాస్ చేయాలని ప్రయత్నించిన యువతి.. సరిగ్గా సిగ్నల్ పడిన టైంలో వేగంగా వస్తున్న ఓ కారు ముందట ఆగింది. ఆ వెంటనే క్యాబ్ డ్రైవర్ మీద ఊగిపోతూ.. ఆమె దాడి చేయడం రికార్డయ్యింది. ఫోన్ పగలకొట్టడంతో పాటు కారులో ఉన్న 600రూ. లాగేసుకుంది. అదంతా అంతా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వాహనదారులంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వచ్చారు.
అటుపై యువతిని, ఆ క్యాబ్ డ్రైవర్‌ను.. అందులో ఉన్న అతని ముగ్గురి స్నేహితుల్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తనకు చిన్న గాయం కూడా అయ్యిందని, తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాపోయింది ఆ యువతి. దీంతో సదాత్ అలీ సిద్ధిఖీపై నిర్లక్క్ష్య పూరిత డ్రైవింగ్ నేరం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని.. స్టేషన్‌లోనే ఉంచారు. ఆపై పూచీకత్తు మీద రిలీజ్ చేశారు. వైరల్ వీడియో ద్వారా ఈ మొత్తం విషయం బయటకు రావడంతో.. కానీ ఆ లక్నో అమ్మాయిని అరెస్ట్ చేయమని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అంతేకాదు క్యాబ్ డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ ట్విటర్ హోరెత్తింది. కళ్ల ముందు ఏం జరిగిందో కనిపిస్తున్నా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువతి అరెస్ట్ డిమాండ్ చేస్తూ.. #ArrestLucknowGirl హ్యాష్ ట్యాగ్ నడిపించారు. మరోవైపు ఆ యువతి ఆచూకీ కోసం ఇంటర్నెట్‌లో విపరీతంగా వెతికారు నెటిజన్స్.
ఈ పరిణామాల తర్వాత సోమవారం కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఉద్దేశపూర్వకంగా దాడి, వస్తువుల్ని నాశనం చేసిన నేరాల కింద కేసు నమోదు అయినట్లు లక్నో అదనపు డీసీపీ చిరంజీవ్నాథ్ సిన్హా వెల్లడించారు. ఇది తన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని, న్యాయం కావాలని బాధితుడు కోరుతున్నాడు. ఇంకోవైపు ఈ యువతి పేరు ప్రియదర్శిని అంటూ కొందరు.. ఆ అమ్మాయి ఫోటోలను వైరల్ చేస్తున్నారు కూడా. అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్లు “సాధారణంగా ఇదే పని ఒక పురుషుడు చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు కదా? ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తే ఏమంటారు? వాళ్ళకి కూడా అదే న్యాయం వర్తిస్తుందా?” అని అడుగుతున్నారు.