మన ఆంతరంగిక వ్యవహారాలలో అమెరికా జోక్యం చేసుకుంటోంది. గతంలో కూడా ఇలా జోక్యం చేసుకు న్నప్పుడు మన విదేశాంగ శాఖ ఘాటైన సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ అమెరికా తన బుద్ధి మార్చు కోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటూ అమెరికా సుద్దులు చెప్పింది. దానిపై మన దేశం భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని ఘాటైన సమాధానమిచ్చింది.
ఇప్పుడు మళ్ళీ మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ చేసి న ప్రకటనపై మన విదేశాంగ శాఖ అదే స్థాయిలో సమా ధానమిచ్చింది.సిఏఏ చట్టంపై భారత ప్రభుత్వ నోటిఫి కేషన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని మిల్లర్ అన్నారు ఇందులో పరిశీలించడానికి ఏముంది? ఈ నోటిఫికేషన్ ఎంతో పారదర్శకంగా ఉన్నప్పుడు అమెరికా పనికట్టు కుని ఈ ప్రకటన చేయడంలో ఆంతర్యం ఏమిటని మన విదేశాంగ ప్రతినిధి ప్రశ్నించారు.పైగా, ఈ నోటిఫికేషన్ పట్ల తాము ఆందోళన చెందుతున్నామంటూ మిల్లర్ చేసిన వ్యాఖ్యపై మన విదేశాంగ శాఖ ఆక్షేపణ తెలిపింది. అమెరికాని ఆందోళనకు గురి చేసేటంతటి విషయాలేవీ ఈ నోటిఫికేషన్‌లో లేవని మన విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చి న ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని కల్పిస్తామన్న భారత ప్రభుత్వ నోటిఫికేషన్‌లో అమెరికా ఆందోళన చెందాల్సి న అంశాలేవీ లేవు. ఈ మూడు దేశాల నుంచి భారత్‌కి వచ్చి పౌరసత్వం లేకుండా ఏళ్ళ తరబడి జీవిస్తున్న వారి కి పౌరసత్వం కల్పించడం తన విధిగా భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. పార్లమెంటు నాల్గేళ్ళక్రితం ఆమోదించి చట్టరూపం ధరించిన బిల్లును ఇంతకాలా నికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ చట్టాన్ని అమలు జేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణా మాలను ఎదుర్కోవల్సింది భారత్, ఇందుకోసం అమెరికా సాయంకోరలేదు. పైగా, సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన దేశంగా భారత్‌కి ఆ హక్కుఉంది.అమెరికాలో వలస వాద చట్టాల అమలుపై గతంలో వ్యక్తం అయిన అసంతృప్తి,ఆగ్రహాల గురించి భారత్ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అమెరికా అధ్యక్షునిగా రెండో సారి విజయం సాధించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు తీసుకుని రానున్నట్టు ప్రకటించారు.దానిపై అక్కడ ఆందోళన వ్యక్తం అయింది.డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ ఎరైవల్స్ (డిఇసిఏ) విషయంలో ఇప్పటికీ విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. దేశాధ్యక్ష పదవికి ట్రంప్ మళ్ళీ రిపబ్లికన్ అభ్యర్ధిగా తలపడుతున్నారు.ఇది పూర్తిగా ఆ దేశపు ఆంతరంగిక సమస్యగా భారత్ భావిస్తోంది. అందుకే స్పందించలేదు.మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానం వివాదాస్పదమైంది. దీనిపై పలువురు ఆందోళ నలు వ్యక్తం చేస్తున్నారు.అలాగే,అమెరికా తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిపై కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై మన దేశంలో నాల్గేళ్ళ క్రితమే ఆందోళనలు జరిగాయి. మళ్ళీ ఆందోళనలకు ప్రతిపక్షాలు సమాయ త్తమవుతున్నాయి. ఇలా ఆందోళనకు ఉపక్రమిస్తున్న వర్గాలు, వ్యక్తులను పురికొల్పడం కోసమే అమెరికా విదేశాంగ ప్రతినిధి ఈ ప్రకటన చేసినట్టు ఉంది.పౌరసత్వ సవరణ చట్టం ఏ దేశపు జాతీయత లేని వ్యక్తుల సమస్యల ను పరిష్కరిస్తుందని మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు.మానవహక్కుల విషయంలో భారత్ ఎంతో కాలంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణం గానే దీనిని రూపొందించినట్టు స్పష్టం చేశారు. భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా ఐక్యరాజ్య సమితి వేదికలపై కూడా గగ్గోలు పెడుతోంది. మానవహక్కులకు భారత్‌లో లభిస్తున్న గౌరవం, సమున్నత స్థానం మరే దేశంలోనూ లేదు.
ఆ మాటకొస్తే అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, ఆస్ట్రేలి యా, బ్రిటన్ తదితర దేశాల్లో మానవహక్కుల పరిస్థితి ఏమంత మెరుగుగా ఉందో ఇటీవల తరచూ వెలువడు తున్న వార్తలే ప్రత్యక్ష నిదర్శనం. ఇజ్రాయెల్ అంతర్జాతీ య చట్టాలను ఉల్లంఘించి పాలస్తీనా స్థావరాలపై జరుపుతున్న దాడులు మానవతకే మచ్చగా ఉన్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు వ్యాఖ్యానిం చాయి. అమెరికా తనకో న్యాయం, ఇతరులకో న్యాయం అన్నరీతిలో వ్యవహిరిస్తోంది. కాశ్మీర్‌లో ప్రశాంతత గురించి అమెరికా దృష్టికి రాలేదు కాబోలు, అందుకే దాని గురించి ఇంతవరకూ వ్యాఖ్యానించలేదు. సీఏఏ వల్ల ఉత్పన్నమయ్యే మంచిచెడులను భారత్ ఎదుర్కొం టుంది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవల్సిన అవసరం లేదు. మన విదేశాంగ ప్రతినిధి ఇచ్చిన సమాధానం అంతరార్థం అదే.