హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీచర్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో 2024 జనవరి 21న సీటెట్ ఎగ్జామ్‌ను జాతీయంగా నిర్వహించనున్నారు. సీటెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుంచే ప్రారంభం కాగా, అభ్యర్థులు ఈ నెల 23 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లలో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ పేర్కొంది. గతంలో 8 పరీక్షా కేంద్రాలు ఉంటే దాన్ని ఆరుకు కుదించారు. మళ్లిప్పుడు ఆరు నుంచి రెండుకు కుదించారు. దీంతో రాష్ట్రంలోని అభ్యర్థులకు కొంత ఇబ్బంది కల్గనుంది. ఇది వరకు దరఖాస్తులు భారీగా రావడం, సెంటర్లు సరిపోకపోవడంతో ఏపీలోని విజయవాడలో పరీక్షాకేంద్రాలను కేటాయించారు. అయినా సీబీఎస్‌ఈ తీరు మార్చుకోకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.