అమరావతి – వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం నాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఆయన నివాసంలో రామచంద్రయ్య కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథ రెడ్డి, పలువురు కడప జిల్లాకు చెందిన కీలక నేతలు సైకిలెక్కేశారు.
చేరికకు ముందు రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో చేరేందుకు పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌కు వచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదు. నాలాగే వైసీపీలో ఎంతో మంది ఉన్నారు.. సమయానుకూలంగా బయటికి వస్తారు. తెలుగుదేశం లో చేరేందుకే నేను చంద్రబాబును కలిశాను. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ రామచంద్రయ్య మీడియాకు వెల్లడించారు.
టిడిపి లో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి
ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం టిడిపి లో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందరెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబసభ్యులంతా చంద్రబాబు సమక్షంలో టిడిపి గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వారికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టిడిపి లోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డి మేనకోడలు అలేఖ్యరెడ్డి దివంగత సినీనటుడు నందమూరి తారకరత్న సతీమణి. 1994లో టిడిపి నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి.
అలాగే సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు, ఆయన తనయులు దాడి రత్నాకర్, దాడి జైవీర్, బాపట్ల జిల్లా, కర్లపాలెం జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, అనంతపురానికి చెందిన డా.కె.రాజీవ్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం నేతలు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు..