హైదరాబాద్: భాగ్యనగర్ లో కోలాహలంగా వినాయకుడి శోభయాత్ర కొనసాగుతున్నది.. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి చిన్న, పెద్ద గణనాధులు సేద తీరేందుకు హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తున్నాయి.. కాగా, సాయంత్రం అయిదు దాటిని తర్వాత పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్ పల్లి, సీతాఫల్‌మండి, బోయిన్‌పల్లి, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, ప్యారడైజ్, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్‌పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్‌మెట్, బాగ్ లింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
ఓవైపు వినాయక నిమజ్జనాలు కొనసాగుతుండగా, మరోవైపు వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక శోభాయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనాలు చూసేందుకు తరలివస్తున్నారు. మరోవైపు అప్పర్ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనానికి గాను 13 క్రేన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు మూడు వేలకుపైగా వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఒక వైపు భక్తులు, మరో వైపు పర్యాటకులు , ఇంకోవైపు శోభయాత్ర శకటాలతో హుస్సేన్ సాగర్ కోలహలం మారింది.. మొత్తం ఆ ప్రాంతం అంతా జనసంద్రమైంది.