Wednesday, November 27, 2024

By Elections – ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి … ఎగువ‌ స‌భ‌కు ‘మెగా’ చాన్స్‌!

మూడు స్థానాల భర్తీకి కసరత్తు షురూ
టీడీపీ రెండు.. జనసేనకు ఒక స్థానం
పసుపు కోటలో ఆశావహుల ఆనందం
గల్లాకు, బీద మస్తాన్‌కే ప్రాధాన్యం
ఒక సీటుపై ఢిల్లీ పెద్దల కర్ఛీఫ్
జనసేనలో మెగా బ్రదర్‌కే అవ‌కాశం
కాదుకూడ‌దంటే సానా సతీష్ రెడీ

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:

వైనాట్ 175 నినాదంతో పొలికేక పెట్టిన వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ద‌క్క‌లేదు. అవమానంతో వైసీపీ అధినేత స‌భ‌నే బహిష్కరించారు. ఇదంతా ముందే ఊహించిన మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. వాస్తవానికి జగన్ విసిరిన బీసీ కార్డుతో వీరంతా రాజ్యసభకు వెళ్లారు. కానీ, మాజీ సీఎం జగన్ అనుసరించిన వైఖరిపైనే పార్టీలోని అగ్రనేతలంతా తీవ్ర మనస్తాపంతో కుమిలిపోతున్నారు. అనేక మంది వైసీపీని వీడుతున్నారు. ఏపీలో అధికారం కోల్పోయిన తరుణంలో వైఎస్సార్సీపీలో వ్యవహారాలను జీర్ణించుకోలేక రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు వీరిద్దరి రాజీనామాలకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 29వ తేదీన ఆమోదం తెలిపారు. మరో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 23న రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖను అందజేశారు. సెప్టెంబర్ 24న కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పదవీ కాలం మరో నాలుగేళ్లకు ముందే కృష్ణయ్య రాజీనామా చేయటం గమనార్హం. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆ ముగ్గురి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి ఎనిమిదికి పడిపోయింది.

ఇక పెద్దల ఎంపిక సందడి..

వైసీపీ రాజ్యసభ సభ్యుల త్యాగం ఫలితంగా ఏపీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగరా మోగింది. అసెంబ్లీలో స్పష్టమైన బలగంతో చిరుదరహాసం చేస్తున్న కూటమి ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించింది. టీడీపీకి రెండు, జనసేనకు ఒక స్థానం లభించే అవకాశం ఉండటంతో… ఆశావహుల జాతకాలపై రాజకీయ విశ్లేషణ జరుగుతోంది. ఆ మూడు స్థానాల భర్తీపై సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి రెండు, జనసేనకు ఒక స్థానం ఖాయమైందని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

జ‌య‌దేవ్‌కు ఖాయ‌మేనా?

టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో ఒకటి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ పాలనలో ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. చివరకు తన అమరరాజా పరిశ్రమను ఇతర రాష్ట్రాలకు తరలించారు.. గత ఎన్నికల ముందు తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించారు. ఎన్నకల్లోనూ పోటీ చేయలేదు. ఈ స్థితిలో గల్లా జయదేవ్ కే ఈ సీటును చంద్రబాబు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో కనిపిస్తున్నారు. ఇక మంత్రివర్గం లో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరునూ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని .. ప్రస్తుతం ఆయనను పక్కన పెట్టే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.

బీసీ కార్డు ఎఫెక్ట్..

జనసేనకు దక్కే రాజ్యసభ స్థానం రేసులో మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ రేసులో నాగబాబు పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మొత్తమ్మీద ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీ, జనసేనలకు ఈ ఉపఎన్నికలతో పెద్దల సభలో చోటు దక్కనుంది. రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ వర్గ ఎంపీలు కావటంతో కూటమి నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుత నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించినా ఢిల్లీ జోక్యంతో ఏపీ సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. ఈ మూడు స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది.

=================

ఎన్నికల షెడ్యూల్ ఇదే ..
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీన.. అభ్యర్థుల‌ నామినేషన్ గడువు ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 20వ తేదీన ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభ అవుతుంది. ఫ‌లితాల‌ను కూడా అదేరోజు ప్ర‌క‌టిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement