92 ఏళ్ల ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ ఐదో పెళ్లి చేసుకోబుతున్న అని సంబర పడ్డాడు. అయితే ఆ సంబరం పెళ్లి నిలిచిపోవడంతో ఆగిపోయిందట.. తన ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారట. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రూపర్ట్ మర్దోక్ -ఆన్ లెస్లీ స్మిత్ కు మార్చి 17న న్యూయార్క్‌లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేసవిలో వారు వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రణాళికలన్నీ అకస్మాత్తుగా ఆగిపోయినట్లు మర్దోక్ సన్నిహితులు వెల్లడించారు. 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాలతో ఆయన పొసగలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్ కు ఇప్పటికే నాలుగుసార్లు వివాహం జరిగింది. 2016లో జెర్రీ హాల్‌ను వివాహం చేసుకున్న ఆయన.. 2022లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే స్మిత్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా ప్రియురాలి చేతికి రింగు తొడిగిన మర్దోక్.. ‘నేను ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహం అని. బాగుంటుందని ఆశిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆయన రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.