ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్ డేటాను బిజినెస్ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేట్ కంపెనీలతో ఈ మేరకు వ్యాపారం చేయాలని చూస్తోంది. దీని ద్వారా 1000 కోట్ల ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు టెండర్ ఆహ్మానించింది. ఈ వార్త తెలిసిన వెంటనే శుక్రవారం నాడు స్టాక్‌మార్కెట్‌లో కంపెనీ షేరు విలువ 4 శాతం మేర పెరిగింది. ప్రయాణికుల వివరాలతో బిజినెస్ చేయాలన్న ఐఆర్‌సీటీసీ ఆలోచనపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రయాణికుల వివరాల గోప్యతకు ఈ నిర్ణయం విఘాతం కల్గిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైల్వే టికెటింగ్‌లో ఐఆర్‌సీటీసీ ఒక్కటే సంస్థ ఉంది. 80 శాతం వరకు టిక్కెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ అవుతున్నాయి. దీని వల్ల పెద్ద సంఖ్యలో ప్రయాణికుల వివరాలు, వారి లావాదేవీల వివరాలు ఐఆర్‌సీటీసీ వద్ద ఉన్నాయి. ఈ డిజిటల్ సమాచారాన్ని ఉపయోగించుకుని అదనపు ఆదాయం సంపాదించాలని సంస్థ చూస్తోంది. ఇందు కోసం ఇప్పికే ఇ- టెండర్‌ను ఆహ్వానించింది. ఈ టెండర్ ఆధారంగా మానిటైజ్ ప్రక్రియపై అధ్యయనం చేయడానికి కన్సెల్టెంట్‌ను నియమించుకోనుంది. ఆసక్తి ఉన్న సంస్థలు టెండర్ వేసేందుకు ఈ నెల 29న చివరి తేదీని పేర్కొంది.
ప్రయాణికుల డేటాలో బిజినెస్..
రైల్వే వద్ద పెద్ద సంఖ్యలో ప్రయాణికుల డేటా ఉంది. దీన్ని ఉపయోగించుకుంటే బిజినెస్ భారీగా చేయవచ్చని భావిస్తోంది. కస్టమర్ అప్పలికేషన్ల డేటాను మానిటైజ్ చేయాలనుకుంటున్నట్లు టెండర్‌లో పేర్కొంది. అదనపు ఆదాయంతో పాటు, సేవలను మెరుగుపరుచుకునేందుకు ఇది దోహదపడుతుందని ఐటీఆర్‌సీటీసీ భావిస్తోంది. ఈ డేటాతో ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని టూర్స్ అండ్ ట్రావెల్స్, హోటల్స్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ వైద్య సంస్థలతో వ్యాపారం చేయనున్నట్లు తెలిపింది.