నిజమాబాద్‌లో క్వింటాలు రూ.17వేలు
13 ఏళ్ల పసుపు ధర రికార్డు బ్రేక్
దుగ్గిరాల మార్కెట్లో క్వింటాలు రూ.13,500
ఎన్నికల వేళ గిట్టుబాటు ధర
ఏపీలోనూ రైతుల సంబురం
(ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్రతినిధి) – పసుపు రైతులకు మంచిరోజులొచ్చాయి. కొద్దిరోజులుగా పసుపు పంటకు గిట్టుబాటు ధర పెరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పసుపు మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత మూడేళ్లతో పోల్చితే ఈ రెండు రాష్ట్రాల్లోని పసుపు రైతుల కళ్లల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఏకంగా 13 ఏళ్ల పసుపు ధర రికార్డు బ్రేక్ చేసింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో గరిష్ఠంగా.. క్వింటాలు పసుపు ధర రూ.17,011 పలికింది. ఇప్పటి వరకూ ఉన్న ధరల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అంటున్నారు. 2011లో క్వింటాలు పసుపు ధర రూ.16,166పలుకగా.. ఇప్పటి వరకూ అదే రికార్డు ధరగా ఉంది. తాజాగా 17 వేలకు చేరడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది.
13 ఏండ్ల తర్వాత రికార్డు ధర
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డుకు.. నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల నుంచి పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే పసుపు అమ్మకాలు జరుపుతుంటారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత పసుపుకు రికార్డు ధర వచ్చిందంటున్నారు. ఇన్నాళ్లు పసుపు పండించి నష్టపోయిన వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.పసుపుకు ఈ స్థాయిలో ధర రావడంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. నిజామాబాద్ కు కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. పూర్తిస్థాయిలో బోర్డును ఏర్పాటు చేశాక.. మరింత రికార్డు ధర వస్తుందని, ఈ రికార్డును తామే తిరగరాస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018-19లో పసుపు ఎగుమతులు 1,33,600 టన్నులు ఉంటే.. ఇప్పుడు అది 1,70,025 టన్నులకు పెరిగిందన్నారు. ఐదేళ్లలో పసుపు ఎగుమతులు 35 వేల టన్నుల మేర పెరిగిందని వివరించారు. పసుపు ఎగుమతి పెరిగి.. దిగుమతి తగ్గడం శుభపరిణామని తెలిపారు. ఆసియాలోనే నిజామాబాద్ పసుపుకు డిమాండ్ ఉందన్నారు.
ఏపీ దుగ్గిరాల మార్కెట్ లోనూ…
గడచిన గత మూడేళ్లుగా గిట్టుబాటు ధర లభించక నానా అవస్థలు పడుతున్న ఏపీలోని దుగ్గిరాల మార్కెట్ లోనూ పసుపు ధర రెట్టింపు పెరిగింది. గత ఏడాది క్వింటాలు పసుపు ధర రూ.7,500లు మించలేదు. గరిష్టంగా రూ.9,500లకు పెరిగింది. గడచిన రెండు రోజులుగు దుగ్గిరాల మార్కెట్లో క్వింటాలు పసుపుధర రూ.13,500లు పలికింది. శనివారం రూ.15,000లకు చేరే అవకాశం ఉన్నట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీలోని దుగ్గిరాల పసుపు మార్కెట్టుకు ఇక్కడి రైతుల నుంచి మంచి డిమాండు ఉంది. కానీ తెలంగాణతో పోల్చితే ధర విషయంలో తక్కువే. గత మూడేళ్ల కాలంలో దుగ్గిరాల మార్కెట్టులో పసుపు ధర పెట్టుబడికి ఖర్చులు కూడా రాని స్థితి. ఎన్నికల వేళ.. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పసుపు మార్కెట్లు కళకళలాడటం విశేషమే.