హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలోని సైన్జ్ లోయలో సోమవారం తెల్లవారు జామున ప్రైవేటు బస్సు పడిపోవడంతో పాఠశాల విద్యార్థులతో సహా 16 మంది మరణించారు. 45 మందితో వెళుతున్న బస్సు ప్రమాద వశాత్తు లోయలో పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం జిల్లా కేంద్రానికి దాదాపు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు క్షత గాత్రులను రక్షించారు. సైన్జ్ వెళుతున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయిందని కులు డిప్యూటీ కమిషనర్ అశుతోశ్ గార్గ్ చెప్పారు.
కులు బస్సు ప్రమాద ఘటన హృదయాన్ని కలచి వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. క్షత గాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. స్థానిక అధికారులు వీలైనంత సహకారం అందించాలని కోరారు. కాగా మృతుల కుటుంబాలకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి రూ 50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.