హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సంక్రాంతి పండుగ రద్దీ మొదలైంది. పండుగ నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడ, వరంగల్, నిజామాబాద్, కర్నూలు, బెంగళూరు జాతీయ రహదారులు ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి దాదాపు 12 లక్షల మంది తమ సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉందని అంచనా. ఈ అంచనాతోనే టీఎస్ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ నుంచి 4233 ప్రత్యేక బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర తెలుగు ప్రజలు అధికంగా ఉండే పట్టణాలకు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే 3500 బస్సులకు ఇవి అదనం. హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, గుడివాడ పట్టణాలకు అలాగే, మహారాష్ట్రలోని ముంబై, నాసిక్, నాందేడ్, చంద్రాపూర్, కర్నాటకలోని బెంగళూరు, బీదర్, బెల్గాం, రాయ్‌చూర్, ఒడిషాలోని బరంపురం తదితర పట్టణాలకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది.
ప్రయాణికులను ఆకర్శించేందుకు వీలుగా రానుపోను టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ చార్జీలో 10 శాతం రాయితీ కూడా ప్రకటించింది. అయితే, అసలు సంక్రాంతి రద్దీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. కాగా, సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ ముందుగా ప్రకటించిన విధంగా పండుగ సందర్బంగా నడుపుతున్న ప్రత్యేక బస్సులలో సైతం సాధారణ చార్జీలనే వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ఆపరేటర్లు అందుకు భిన్నంగా ఎప్పుడూ ఉండే చార్జీల కంటే మూడు నాలుగింతలు ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు, విశాఖపట్టణం, తిరుపతి ప్రాంతాలకు సాధారణ చార్జీ రూ.900 నుంచి 1100 వందలు ఉండగా, ప్రైవేటు ఆపరేటర్లు రూ.2 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, ఏలూరు, గుడివాడ, అమలాపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు సాధారణ చార్జీ రూ.600 నుంచి 800 వరకు ఉండగా, ప్రైవేటు ఆపరేటర్లు అంతకు మూడింతలు రూ.2 నుంచి 3 వేల వరకూ దండుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోను సంఖ్యలో లేకపోవడంతో ఎలాగైనా సొంతూళ్లకు ముందే చేరుకోవాలన్న కుతూహలంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్లకు అడిగినంత చెల్లిస్తున్నారు. మరోవైపు, కర్నాటక ఆర్టీసీ బస్సులకు టికెట్ చార్జీ తక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రజలు కర్నాటక ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. కర్నాటక రాష్ట్రంలో కంటే డీజిల్ ధర తక్కువ ఉన్న కారణంగానే ఆ రాష్ట్ర బస్సులకు టికెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.