Friday, November 22, 2024

బతికుండగానే పూడ్చిపెట్టాడు… మాజీ బాయ్‌ఫ్రెండ్‌ చేతిలో భారతీయ నర్సింగ్‌ విద్యార్థిని హత్య

బంధాన్ని తెగతెంపులు చేసుకుందనే ప్రతీకారంతో ప్రియురాలిపై పగతో రగలిపోయిన ఒక యువకుడు ఆమెను బతికుండగానే చిత్రహింసలు పెట్టి మరీ పూడ్చిపెట్టాడు. నిందితుడు తారిక్‌జోత్‌ సింగ్‌ కాగా అడెలాయిడ్‌ నగరానికి చెందిన జస్మీన్‌ కౌర్‌ అనే 21 సంవత్సరాల భారతీయ నర్సింగ్‌ స్టూడెంట్‌ సింగ్‌ చేతిలో దారుణ హత్యకు గురైంది. సౌత్‌ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని మారుమూల ఫ్లిండెర్స్‌ పర్వత పంక్తుల్లో 2021 మార్చి ఐదవ తేదీన ఈ ఘోరం చోటు చేసుకుంది. నిందితుడికి శిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో వాదోపవదాలు జరిగిన సందర్భంగా ఘటనకు సంబంధించి నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దారుణ హత్యకు గురికావడానికి నెల రోజుల ముందు తారిక్‌జోత్‌ సింగ్‌ తనను వేధిస్తున్నాడని పేర్కొంటూ పోలీసులకు జస్మిన్‌ కౌర్‌ ఫిర్యాదు చేసింది. తారిక్‌జోత్‌ సింగ్‌ను తన కుమార్తె వందసార్లుకు పైగా నిరాకరించిందని కౌర్‌ తల్లి కోర్టుకు తెలిపారు.

- Advertisement -

తనతో ప్రేమబంధాన్ని తెగతెంపులు చేసుకోవడంతో పాటు తనపై పోలీసులకు కౌర్‌ ఫిర్యాదు చేయడాన్ని సింగ్‌ తట్టుకోలేకపోయాడు. ఆమెను చంపడానికి కుట్ర పన్నాడు. చంపడానికి ముందు ఆమెకు వరుసగా మెస్సేజ్‌లు పెట్టాడు. ”నేను ఇంకా బతికి ఉండటం నీ బ్యాడ్‌ లక్‌. చూస్తూ ఉండు.. నువ్వు చేసిన ప్రతి ఒక్కదానికి బదులు తీర్చుకుంటా” అని ఆమెకు పంపిన ఒకానొక మెస్సేజ్‌లో రాసుకొచ్చాడు. మార్చి ఐదవ తేదీన ఫ్రెండ్‌ను అడిగి కారు తెచ్చుకున్నాడు. కౌర్‌ను కిడ్నాప్‌ చేయడానికి ముందు అదే రోజు మధ్యాహ్నం ఒక హార్డ్‌వేర్‌ దుకాణంలో గ్లౌజులు, కేబుల్‌, పార కొన్నాడు. జస్మిన్‌ కౌర్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఆమె కాళ్ళు, చేతులను కట్టేసి కారు డిక్కీలో పడుకోబెట్టాడు.

650 కి.మీ.ల దూరంలో ఉన్న సౌత్‌ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని మారుమూల ఫ్లిండెర్స్‌ పర్వత పంక్తుల్లోకి కారును నడుపుకుంటూ వెళ్ళాడు. ఆమె గొంతు మీద కత్తితో గాట్లు పెట్టాడు. పారతో అంతగా లోతు లేని గొయ్యి తీశాడు. కత్తి గాట్లతో విలవిలలాడుతున్న కౌర్‌ను ప్రాణం ఉండగానే గోతిలో పూడ్చి పెట్టాడు. అయితే చేసిన నేరాన్ని సింగ్‌ అంగీకరించలేదు. తానెలాంటి హత్య చేయలేదని ఆత్మహత్య చేసుకున్న ఆమె దేహాన్ని గోతిలో పూడ్చిపెట్టడం మాత్రమే చేశానని వాదించాడు. అయితే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితుడు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే క్షణికావేశంతో, కోపంతో చేసిన నేరం కనుక తన క్లయింట్‌కు శిక్ష విధించడంలో దయ చూపాల్సిందిగా తారిక్‌ జోత్‌ సింగ్‌ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement