హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికి.. కొత్త కనెక్షన్లకు సబ్సిడీ నిధులు పెంచకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ ధర గతంతో పోలిస్తే రెండున్నర రెట్లు పెరిగింది. కానీ రైతులకిచ్చే సబ్సిడీని మాత్రం ప్రభుత్వం పెంచలేదు. స్తంబాలు, కండక్టర్ ( వైరు) ధరలు పెరగడంతో రైతులపైనే ఆర్థిక భారం పడుతోంది. ఒక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు రూ. 5,738లు డీడీ రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక విద్యుత్ కనెక్షన్‌కు ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 70 వేల చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని త రైతులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మగ్గురు రైతుల కలిసి ఒక ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం రూ. 2. 10 లక్షల సబ్సిడీ వచ్చేది. ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ డబ్బులతో ట్రాన్స్‌ఫార్మర్ , వ్యవసాయ బోరు భావి వరకు కావాల్సిన స్తంభాలు, వైర్లు, ఇతర సామాగ్రిని విద్యుత్ పంపిణీ సంస్థలే సమకూర్చుతాయి. ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్స్ ధరలు అమాంతం పెరిగాయి. ఫిబ్రవరిలో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ధర రూ. 25 వేలు ఉంటే ఇప్పుడు ఆరు నెలలు తిరక్కుండానే 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ధర రూ. 1.37 లక్షలకు చేరింది.
ప్రైవేట్ కంపెనీల నుంచి అవసరమైన ట్రాన్స్‌పార్మర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సరిపోకపోవడంతో.. విద్యుత్ పంపిణీ సంస్థలు రైతులపైనే భారం వేస్తున్నాయి. దీంతో రైతు పోలం వద్దకు విద్యుత్ కనెక్షన్ తీసుకెళ్లేందుకు అవసరమైన స్తంభాలు, కండక్టర్ వైర్, ఇలా అన్ని ఖర్చులు భరించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దాదాపుగా 54 వేలకు పైగానే దరఖాస్తులు చేసుకున్నట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొత్త కనెక్షన్లను మంజూరు చేశాక వ్యవసాయం ప్రారంభించేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ట్రాన్స్‌ఫార్మర్‌కే సరిపోతుండటంతో.. మిగతా పరికరాల కోసం రైతులు అదనంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఒక స్తంభం దర రూ. 2,500 వరకు ఉంటుంది. దానికి సంబంధించిన వైరుకు మీటర్ చొప్పున చెల్లించి కొనుగోలు చేయాల్స ఉంటుంది.
రాష్ట్రంలో 26 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు..
రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల వరకు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికి ప్రభుత్వం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నది. రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణలో 18 లక్షల విద్యుత్ కనెక్షన్లు మాత్రమే ఉంటే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటీ వరకు 7,47,268 విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విద్యుత్ కనెక్షన్లకు గాను రూ. 2,861 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన విద్యుత్ కనెక్షన్లలో ఎస్పీడీసీఎల్ పరిధిలో 4,49,169 విద్యుత్ కనెక్షన్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,98,099 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ వ్యవసాయ పంపుసెట్లన్నింటికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నట్లుగానే.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సబ్సిడీ నిధులను పెంచాలని ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.