మరిపెడ, (ప్రభ న్యూస్): ఎస్సారెస్పీ కాల్వకు పడిన గండిని పూడ్చకుండా నీటిని వదులుతున్నారు. దీంతో తాము ఏటా పత్తి పంట నష్టపోతున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. కాల్వ నుంచి వచ్చే నీరు పంటలను ముంచెత్తడంతో తీవ్ర నష్టం వాటిళ్లుతోందని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. గండి పడ్డ చోట మరమ్మతులు చేసి పంటలను కాపాడాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్పురం రైతులు కోరుతున్నారు. మరిపెడ మండలం బురహాన్పురం గ్రామ సమీపం నుంచి డీపీఎం60 21ఆర్ ఆఫ్3ఆర్ 3ఆర్ కేనాల్ ఎస్సారెస్పీ కెనాల్ వెళ్తోంది. ఈ కాల్వకు మూడేళ్ల క్రితం గండిపడినట్లు బాధిత రైతులు తెలిపారు. రెండేళ్ల క్రితం అధికారులకు సమస్యపై ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిశీలించి వెళ్లారని కాని మరమ్మతు పనులు చేయక పోవటంతో తామే రాళ్లు, ఇసుక బస్తాలతో గండిని తాత్కాలికంగా పూడ్చినట్లు తెలిపారు.
అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, కాల్వ నుంచి వచ్చిన నీటి ప్రవాహానికి మళ్లీ గండి పడి పంట పొలాల్లోకి నీరు చేరిందని తెలిపారు. బ్యాకింగ్ లోపం, కాంట్రాక్టర్ నాసిరకం పనులతో కాల్వకు గండి పడినట్లు వారు ఆరోపించారు. కాల్వ పనులు కూడా పూర్తి స్థాయిలో చేయలేదని ప్రతి ఏటా పంటలు మునుగుతున్నాయని వాపోయారు. కనీసం గండి పూడ్చకుండా నీటిని వదలటంతో సుమారు 20ఎకరాల పత్తి, వరి పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వ నీరు ప్రవహిస్తుండటంతో గండి పడిన ప్రాంతం కింద నష్టపోయిన రైతులు ఆబోతు సురేందర్, పెదబోయిన రాములు, పెదబోయిన కొమురయ్య, పెదబోయిన ఐలమల్లు , కోట దేవకమ్మ, గడ్డం సత్తిరెడ్డి , చింత వెంకన్న, జంపెళ్లి సురేష్ , గడ్డం వెంకట్రెడ్డి పొలాలు, పత్తి పంట నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ గండి పూడ్చివేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.