పోలింగ్ జరగకూడదని మావోయిస్టుల పంతం
జరిపితీరుతామంటున్న అధికార యంత్రాంగం
ఏకంగా గడ్చిరోలీని కంటోన్మెంట్‌గా మార్చేసిన పోలీసులు
రంగంలోకి 130 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు
180 బెటాలియన్స్ మోహరింపు..
అడుగుడుగునా గన్ పాయింట్‌తో పహరా
ఓటింగ్‌కు రప్పించేందుకు సన్నాహాలు
19నే పోలింగ్… అంతటా టెన్షన్
మహరాష్ట్ర విదర్భలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో బుల్లెట్, బ్యాలెట్ మధ్య వివాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటు వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని నక్సల్స్ హెచ్చరించారు. రె డ్ టెర్రర్‌ను ఎదుర్కోవడానికి పరిపాలన కూడా సిద్ధంగా ఉంది. గడ్చిరోలిని పోలీసు కంటోన్మెంట్‌గా మార్చారు. ఓటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు 130 డ్రోన్లు, 6 ఎంఐ 17 హెలికాప్టర్లు, 180 బెటాలియన్స్‌ని గడ్చిరోలిలో మోహరించారు. నిఘా నీడలో.. పోలీసు బలగాల పర్యవేక్షణలో ఏప్రిల్ 19న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీ) సందీప్ పాటిల్, గడ్చిరోలి రేంజ్ డీఐజీ అంకిత్ గోయల్ జిల్లా కేంద్రంలో క్యాంప్ చేస్తున్నారు.
ప్రతి సందు సందులో.. పోలీస్ పికెట్స్
గడ్చిరోలిలోని ప్రతి ప్రాంతాన్ని హెలికాప్టర్‌లో పర్యవేక్షిస్తున్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నీలోత్పాల్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 19 న ప్రతి సందు, మూలలో 15,000 మంది సెంట్రల్ ఆర్మ్స్ పోలీస్ ఫోర్స్ (సిఎపిఎఫ్) సిబ్బందిని మోహరిస్తారు. ప్రస్తుతం సీఏపీఎఫ్‌కు చెందిన 47 కంపెనీలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండగా, 40 కంపెనీలను శివార్లలో మోహరించినట్లు తెలిపారు. ఓటింగ్ రోజున మొత్తం ప్రాంతాన్ని 6 MI-17 హెలికాప్టర్లు, 180 సోర్టీల ద్వారా పర్యవేక్షిస్తారు. అయితే ఏ పరిస్థితిలోనైనా వైద్య సౌకర్యాల కోసం ఎయిర్ అంబులెన్స్ కూడా మోహరించబడుతుంది.
ఓటేస్తే తర్వాత మీ ఇష్టం.. నక్సల్ వార్నింగ్
గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీలలో మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా గోండియా జిల్లాలోని గడ్చిరోలి, ఆర్మోరి, సిరోంచా, అమ్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం పడింది. భామ్రాగఢ్, పెరిమిలి, ధనోరా, పెండ్రి, కసన్సూర్, గట్టా, లాహిరి, బినాగుండతో సహా ఉత్తర, దక్షిణ గడ్చిరోలిలోని ఇతర మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల కార్యకలాపాలు పోలీసుల నీడలో కొనసాగుతున్నాయి.. మరో వైపు ఓటింగ్ లో పాల్గొనవద్దని నక్సలైట్లు పిలుపు ఇచ్చారు.. ఇంకో వైపు భద్రత కల్పిస్తాం ఓటింగ్ రమ్మంటూ అధికార యంత్రాంగం పిలుపులు . ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు గిరిజనులు .