ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టు ఇన్‌చార్జి, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని రైల్వే శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. ఆయన అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంది. బుల్లెట్ ట్రయిన్ ఇన్‌చార్జి బాధ్యతలను రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. ఆయన ఈ పదవిలో మూడునెలల పాటు కొనసాగుతారు. సీనియర్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రి రైల్ వికాస్ నిగం లిమిటెడ్ సీఎండీగా తొమ్మిదేళ్లపాటు పని చేశారు. ఆ సమయంలో ఓ ప్రయివేటు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు జరిగాయేమో దర్యాప్తు చేయాలని సీబీఐను లోక్ పాల్ జూన్ 2న ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 12లోగా నివేదిక సమర్పించాలని తెలిపింది. అనధికారికంగా ఓ ప్రయివేటు కంపెనీకి నిధులను మళ్లించారని అగ్నిహోత్రిపై ఆరోపణలు వచ్చాయి.
అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సర్వీస్ నుంచి రైల్వేశాఖ తొలగించి, బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టు ఇన్‌చార్జి బాధ్యతలను మూడు నెలలపాటు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్ డైరెక్టర్ ( ప్రాజెక్ట్ ) రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుల అమలు కోసం భారత ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్. అగ్ని హోత్రి పదవీ విరమణ తర్వాత ఓ ఏడాదిలోగానే ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని రైల్వే అధికారులు తెలిపారు. రిటైర్డ్ అధికారులు తాము పదవి విరమణ చేసిన తర్వాత ఓ ఏడాది నిండక ముందే ఏదైనా కంపెనీలో, వాణిజ్య సంస్థలో ఉద్యోగం పొందకూడదని, ఒక వేళ ఓ ఏడాదిలోగా ఉద్యోగాన్ని స్వీకరించాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్ననాయన్నారు. అగ్నిహోత్రి ఈ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలను అగ్నిహోత్రి త్రోసిపుచ్చారు. తాను ఏ కంపెనీకైనా అనుకూలంగా పని చేయలేదన్నారు. ఇటువంటి పనులను చేసే ఏ కంపెనీలోనూ తన కుమారుడు పని చేయడం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.