ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బుల్లెట్ బండి పాట’నే వినిపిస్తోంది. ఈ పాట వింటే చిన్నాపెద్దా అందరిలో జోష్ వస్తోంది. ఈపాటతో పాట పాడిన అసలు సింగర్ కన్నా స్టెప్స్ వేసిన పెళ్లికుమార్తె బాగా పాపులర్ అయిపోయింది. యూట్యూబ్‌లో ఈ పాట మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే సాంగ్ పాడుకోడం కనిపించింది. పెళ్లిళ్లలో ఇదో ట్రెండ్‌గా మారింది. ఫంక్షన్లలో ఇదో తప్పనిసరి ఐటెంగా మారిపోయింది.
తాజాగా బుల్లెట్ బండి సాంగ్ రోగాలను నయం చేసేదిగా కూడా మారిపోయిందా అంటే అవుననే అనాలి. పాట వల్ల వ్యాధులు నయం కాకపోయినా పేషెంట్లలో జోష్ నింపుతోంది సాంగ్. ఒక ఉత్సాహాన్ని, బతుకు మీద ఆశను కల్పిస్తోంది. తాజాగా ఈ సాంగ్‌ను ఒక థెరపీగా ఆస్పత్రి సిబ్బంది వినియోగించడం వెలుగులోకి వచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఓ పేషెంట్ ట్రీట్ మెంట్ కోసం నర్స్ బుల్లెట్ బండి సాంగ్ ను ప్రయోగించింది. బుల్లెట్ సాంగ్ కు నర్సుతో కలసి ఆ రోగి ఆస్పత్రి బెడ్ పైనే డాన్స్ చేసే ప్రయత్నం చేశాడు. పక్షవాతంతో చచ్చుబడిపోయిన చేతిని సైతం ఈ పాటలో పైకి లేపే ప్రయత్నం చేశాడు. నర్స్ ఇచ్చిన ప్రోత్సాహానికి ఆ రోగి స్పందించిన తీరు ఆస్పత్రి సిబ్బందిని సైతం సంతోషపరచింది.