దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. 2022 ఏడాది ముగింపు సెషన్‌కు ముందురోజు బుల్‌రన్ కొనసాగింది. డిసెంబర్ మాసం డెరివేటివ్స్ ముగింపు వేళ, కిందిస్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీనికి షార్ట్ కవరింగ్ తోడైంది. దాంతోమధ్యాహ్నం వరకు స్తబ్దుగా సాగిన ట్రేడింగ్, ఆ తర్వాత పరుగందుకుంది. నష్టాల్లో నుంచి సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. చివరి అరగంటలో దూకుడు మరింత పెరిగింది. ఇంట్రాడే కనిష్టాల నుంచి సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్లు పుంజుకుంది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నం వరకు ఒత్తిళ్ల మధ్యే కదలాడింది.
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, మన మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం సెన్సెక్ 60,628 వద్ద నష్టాలతో మొదలైంది. ఒక దశలో 60,479 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 223 పాయింట్ల లాభంతో 61,133 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ సైతం 18,045 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి, 17,992 వద్ద కనిష్టాన్ని తాకింది. అక్కడి నుంచి దాదాపు 200 పాయింట్లు పుంజుకుని, చివరకు 68 పాయింట్ల లాభంతో 18,191 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.79 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ -30 సూచీలో భారతీయ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్‌బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్, విప్రో షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌సీయూఎల్, బజాబ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టి, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.