దేశ ప్రజలపై పెట్రో బాంబు పేలేందుకు సిద్ధంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత.. తొలిసారి దేశంలో పెట్రో ధరల మంట మండింది. బల్క్ యూజర్లకు లీటర్ డీజెల్ ధర ఏకంగా రూ.25 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు 40 శాతం పెరగడంతో.. బల్క్ యూజర్లకు ఇచ్చే ఇంధనం ధర పెంచేశారు. త్వరలో పెట్రో ధరలు కచ్చితంగా పెరుగుతాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. బల్క్ యూజర్లు అంటే.. బస్ ఫ్లీట్ ఆపరేటర్లు, మాల్స్, ఎయిర్‌పోర్టులు వంటి పలు రంగాల సంస్థలు. వీళ్లు సాధారణంగా నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డీజెల్‌ను కొనుగోలు చేస్తారు. ముంబైలో లీటర్ డీజెల్ ధర రూ.94.14 పైసలు కానీ.. బల్క్‌గా కొనుగోలు చేయాలంటే.. ఇక రూ.122 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లిdలో లీటర్ డీజెల్ ధర రూ.86.67 పైసలు. ఇక బల్క్‌లో లీటర్ డీజెల్ ధర రూ.115గా నిర్ణయించింది. డీజెల్ ధరలు పెరగడంతో.. బల్క్ వినియోగదారులు కూడా పెట్రోల్ బంకుల వద్దే రిటైల్ వినియోగదారుల్లా కొనుగోలు చేస్తున్నారు.
అంతర్జాతీయ ధరలే కారణం..
భారత్‌లో నవంబర్ 4, 2021 నుంచి రిటైల్ ధరలు పెరగలేదు. బల్క్ యూజర్లకు రేటు పెంచితే.. ప్రైవేట్ ఇంధన రిటైల్ పరిస్థితి ఏమిటన్నది కీలకంగా మారింది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో తమ రిటైల్ బంకులను మూసివేస్తారా..? అనేది సందేహాస్పదంగా మారింది. గత 136 రోజులుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. రాయితీ ధరకు చమురును పొందే ప్రభుత్వ రంగ సంస్థలతో ఇవి పోటీ పడలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంకులను మూసివేయడం తప్ప మరో మార్గం తమ ముందు లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2008లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 1432 పెట్రోల్ బంకులను మూసివేసింది. మొత్తం మీద బల్క్ యూజర్లకు పెంచిన రూ.25 లీటర్ ధర ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మాల్స్, ట్రావెల్స్ సర్వీసులపై ప్రభావం..
బల్క్ డీజెల్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకుంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజెల్‌ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలు మరింత పెరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్స్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలు దేశాల్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. భారత్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాలు తరువాత ధరలు పెరుగుతాయని భావించడంతో ఎన్నడూ లేనంతగా.. జనాలు పెట్రోల్, డీజెల్‌ను భారీగా నిల్వ చేసుకున్నారు. అయితే బడ్జెట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ధరల పెంపుపై కేంద్రం వెనక్కి తగ్గినట్టుగా స్పష్టమైంది.
రిటైల్ ధరల్లో లేని మార్పు..
సాధారణంగా బల్క్ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్ ధరలతో పోలిస్తే.. ఎక్కువే ఉంటాయి. ఈ అధిక ధర నుంచి తప్పించుకోవడానికి వారంతా పెట్రోల్ పంపుల వైపు పరుగులు పెట్టారు. మరోవైపు సామాన్యులు కూడా భారీగా కొనుగోళ్లు జరిపారు. ఈ నెల పెట్రోల్ పంపుల వద్ద విక్రయాలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. ఇది రిటైల్ విక్రయ సంస్థల నష్టాల పెరుగుదలకు దారితీసింది. ఆదివారం నాటి రిటైల్ ధరలు గమనిస్తే.. ఎలాంటి మార్పు లేదు. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లిdలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.50గా ఉంది. ఇక లీటర్ డీజెల్ విషయానికొస్తే.. ఢిల్లిdలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ప్రస్తుతం పోర్టు బ్లెయిర్‌లోనే ఇంధనం తక్కువ ధరకు దొరుకుతున్నది. లీటర్ పెట్రోల్ రూ.82.96 ఉండగా.. డీజెల్ రూ.77.13గా ఉంది.
దీపావళి నుంచి యథాతథం..
గతేడాది కేంద్ర ప్రభుతం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజెల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్ర ప్రభుతాలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పు లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. పైకి.. కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజెల్ ధరలపై పడుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..