Tuesday, November 19, 2024

Building Collapse – ఇంటి ఎత్తు పెంచాల‌ని అనుకుంటే…. అస‌లుకే ఎస‌రు..

హైదరాబాద్ లోని చింతల్‌లో ఓ ఇంటి యజమాని త‌న ఇంటి ఎత్తు పెంపు కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టి అస‌లుకే ఎస‌రు వ‌చ్చింది.. వివ‌రాల‌లోకి వెళితే.. చింతల్ కు చెందిన నాగేశ్వరరావు 25 ఏళ్ల కిందట శ్రీనివాస్‌నగర్‌ లో ఇల్లు కట్టుకున్నాడు. కాలక్రమంలో ఇంటి ముందున్న రోడ్డు ఎత్తు పెరగగా.. వర్షాకాలం వరద నీళ్లు ఇంట్లోకి చేరుతున్నాయి. ఈ ఏడాది వరద నీరు ఇంట్లోకి రాకుండా నాగేశ్వరరావు చర్యలు చేపట్టాడు. తన ఇంటిని ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించాడు. పనులు కూడా మొదలు పెట్టారు. హైడ్రాలిక్ జాకీలతో ఇంటిని నెమ్మదిగా పైకి లేపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జాకీలు పక్కకు జరగడంతో ఇల్లు పక్క బిల్డింగ్ పైకి వాలింది.

జీ ప్లస్ 2 విధానంలో నిర్మించిన ఈ భవనం మొత్తం పక్క బిల్డింగ్ పై వాలడంతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. పక్క బిల్డింగ్ లో ఉంటున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో శ్రీనివాసనగర్ చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇంటిని పరిశీలించారు. ఇంటి ఎత్తు పెంచే క్రమంలో జాకీలు పక్కకు జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే మరమ్మతు పనులు చేపట్టడంతో నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, నాగేశ్వరరావు ఇంటిని కూల్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు.. నేటి సాయంత్రం లోగా ఇళ్లు కూల్చివేయాల‌ని ఆదేశించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement