పాట్నా – బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీజేపీ మద్దతుతో మరోసారి జేడీయూ-బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఈ రోజు సాయంత్రం సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావన్ కుమార్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేత డాక్టర్ ప్రేమ్ కుమార్, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, బీహార్‌లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌కి అభినందనలు తెలియజేశారు. ‘ బీహార్‌లో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసిన సామ్రాట్ చౌదరీ, విజయ్ సిన్హాలను అభినందిస్తున్నాను. ఈ బృందం రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యులకు పూర్తి అంకిత భావంతో సేవ చేస్తుందనే నమ్మకం నాకుంది” అని ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు .