దేశంలో పెరుగుతున్న ఉల్లి జధరలను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే టమాటా ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే, తాజాగా ఉల్లిగడ్డల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ
ఆర్ధిక సంవత్సరం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను కేంద్రం బఫర్ స్టాక్‌గా దోగాముల్లో భద్రపరిచింది.
మార్కెట్‌లో సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను విడుదల చేస్తుంది. ఇలా స్టాక్‌ను విడుదల చేయడం వల్ల ధరలు భారీగా పెరగకుండా నిరోధించేందుకు అవకాశం కలుగుతుంది. నిత్యావసరాల్లో అత్యంత ముఖ్యమైన ఉల్లి ధరలు మార్కెట్‌లో తరచుగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ముఖ్యంగా రైతులు సరకు మార్కెట్‌కు తీసుకు వచ్చే సమయంలో ధరలు అమాంతం తగ్గిపోతుంటాయి. సరఫరాలను నియంత్రిస్తూ వ్యాపారులు వాటి ధరలను ఇష్టానుసారం పెంచుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉల్లి భారీగా మార్కెట్లోకి వచ్చే సమయంలో ప్రభుత్వం భారీగా సేకరించి, గోదాముల్లో భద్రపరుస్తోంది.
దేశంలోని అన్న ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లి నిల్వలను పంపించాలని నిర్ణయించినట్లు ఆహార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం అత్యధిక రేటు నమోదైన ప్రాంతాలకు, దేశ సగటు కంటే ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు, గత నెలతో పోల్చితే వీటి ధరలు పెరిగిన రాష్ట్రాలకు ఈ స్టాక్‌ను పంపించనున్నట్లు తెలిపింది. ఈ-వేలం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తామని ఆ ప్రకటనలతో తెలిపింది.
వినియోగదారులకు తక్కువ ధరలో ఉల్లిపాయలను అందించేందుకు వాటిని పంపించాల్సిన ప్రాంతాలను, పరిమాణానాన్ని నిర్ణయిస్తామని తెలిపింది. గతంలో ఉల్లి ధరలు భారీగా పెరగడంతో కేంద్రం బఫర్ స్టాక్‌ను పెంచుకుంటూ వస్తోంది. 2020-2 ఆర్ధిక సంవత్సరంలో లక్ష మెట్రిక్ టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ మాత్రమే ఉంది. అది తాజాగా 3 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో పండించిన ఉల్లి ఉత్పత్తి మార్కెట్‌లో 65 శాతం వాటా కలిగి ఉంది. దీంతో మళ్లి ఖరీఫ్ సీజన్‌లో పండించే ఉల్లి అందుబాటులోకి వచ్చే వరకు వినియోగదారుల అవసరాలు తీరుస్తున్నాయి.