న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేలా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2014లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేయడాన్ని ప్రారంభించిన కేసీఆర్ అదే మోసపూరిత ధోరణిని కొనసాగిస్తున్నారన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ సర్కారు ఏం చేసిందో చెప్పుకోలేక కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేందుకే బడ్జెట్ పెట్టుకున్నట్లు అనిపించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చదివిన వేల పుస్తకాల్లోని భాషా జ్ఞానాన్ని ఈ బడ్జెట్‌లో కూర్చారని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో సాహిత్యం ఎక్కువైంది… సమాచారం తక్కువైంది, మొత్తం కుటుంబ సందేశమే ఆవిష్కృతమైందని పేర్కొన్నారు.
వివిధ రంగాలకు గత బడ్జెట్లలో ప్రకటించిన నిధులనే అక్షరం కూడా మార్చకుండా ఈ బడ్జెట్‌లోనూ జోడించారని ఆయన ఆరోపించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు కల్వకుంట్ల కుటుంబ ప్రచారానికి వెయ్యి కోట్లను కేటాయించడం హాస్యాస్పదమన్నారు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వమే ప్రచారం కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తే 2.9 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా వెయ్యి కోట్లను ప్రచారానికి కేటాయించడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఇదేనా తెలంగాణ సమాజం కోరుకుంటున్న గుణాత్మకమైన మార్పని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించడమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కల్వకుంట్ల కుంటుంబానికి ఓ పనిగా మారిందన్నారు. మోదీ సర్కారుపై బురదజల్లడం వల్ల తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ తమది ముమ్మాటికే కుటుంబ ప్రభుత్వమేనని అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. 1200 మంది అమరుల బలిదానం, మరెందరో మంది మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు చేసిన త్యాగాలు కల్వకుంట్ల కుటుంబం కోసం కాదన్నారు. బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చింది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే తప్ప కల్వకుంట్ల కుటుంబానికి అధికారాన్ని కట్టబెట్టడం కోసం కాదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం సాధ్యం కాకపోవడంతోనే కేటీఆర్ ఆత్మరక్షణలో పడి అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం చేజారిందన్న బాధలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను, ఆయన పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని కేంద్రమంత్రి పేర్కొన్నారు.