హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే నెల 3నుంచి శాసనసబా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మొదటిరోజు మధ్యాహ్నం 12.10గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 2న మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. 3న మధ్యాహ్నం 12.10 గంటలకు ఏక కాలంలో ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. మరోవైపు తదుపరి రోజు శనివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆదివారం సెలవుదినంగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ సంతాపతీర్మానాలు ఉంటే వాటిని ప్రవేశపెట్టి అదేరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అనంతరం మొదటిరోజు సభను వాయిదా వేసే యోచనలో ఉండగా, ఇంకోవైపు మరుసటిరోజున శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆదివారం సెలవుదినం ఇవ్వాలనే కోణంలో కూడా ప్రభుత్వం చర్చించింది.
అయితే ఇంకా ఏతేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా సభ్యుల పరిశీలన నిమిత్తం మరునాడు ఉభయ సభలకు విరామమిచ్చి తర్వాత వర్కింగ్ దినాల్లో బీఏసీ నిర్వహించనున్నారు. సభను ఎన్నిరోజులపాటు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత ఏడాది రూ.2.56 లక్షలకోట్ల బడ్జెట్ అమాంతం రూ.40వేల కోట్ల పెంపుతో భారీ సైజుకు చేర్చేలా సీఎం కేసీఆర్ ఆమోదమద్ర వేసినట్లు తెలిసింది. దీంతో రూ.2.95 లక్షల కోట్లకు బడ్జెట్ పద్దు తుది ఆమోదం దిశగా సిద్దం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాబడి శాఖలకు భారీ లక్ష్యం నిర్దేశించినట్లు సమాచారం. కీలక శాఖలనుంచి ఆదాయపెంపులో భాగంగా లీకేజీలు, వృధా కట్టడి, మరింత పారదర్శక విధానాల దిశగా కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది సాగునీటి నామ వార్షిక బడ్జెట్ దిశగా ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆర్ధిక శాఖకు దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్షించి కీలక సూచనలు చేశారు. 2023-24 ఆర్ధిక ఏడాదిలో కూడా మరోసారి సాగునీటిరంగానికి సింహభాగం కల్పించి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సాగునీటిరంగానికి అగ్రతాంబూలం దిశగా ప్రతిపాదించిన ప్రాథమిక లెక్కల్లో సుమారు రూ. 37వేల కోట్లను కేటాయించేలా ఆమోదం లభించినట్లు తెలిసింది. ఇందులో రూ.16వేల కోట్లను కేవలం కాళేశ్వరానికి కేటాయించనున్నారు. ఈ ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయింపులను చేస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల రీ పేమెంట్లు, అసలు, వడ్డీల చెల్లింపులకు భారీ మొత్తంలో ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల దిశగా అనుమతులు తీసుకున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్ధిక శాఖ సుధీర్గ కసరత్తు చేసింది. అన్ని శాఖలనుంచి ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు సేకరించి ముసాయిదాను సిద్దం చేసి సీఎం కేసీఆర్ ఎదుట ఉంచింది. 2023-24 వార్షిక ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌లో వ్యయప్రతిపాదనలు భారీగా నమోదయ్యాయి. ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే బడ్జెట్ సైజ్ పెరుగుతోంది. ఇలా అన్ని శాఖలనుంచి రూ.3లక్షలకోట్లకు బడ్జెట్ చేరుకున్నది. విద్య, వైద్యం, నీటిపారుదల, సంక్షేమ శాఖలు ఎక్కువగా ప్రతిపాదనలు చేశాయి. ఇరిగేషన్‌కు రూ.37వేల కోట్లు, ఆర్ అండ్ బీకి రూ.25వేల కోట్లకుపైగా ప్రతిపాదించినట్లు తెలిసింది. తుది దశలో ఉన్న కలెక్టరేట్లు, సచివాయం, ఇతర నిర్మాణాలు, రహదారుల అభివృద్ధికి ఈ శాఖకు అధిక నిధుల అవసరం నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కూడా కేటాయింపులు పెంచగా, ఆసరా పెన్షన్లకు రూ.12 వేలకోట్లకు పెరగనుంది. కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, కంటివెలుగు, కేసీఆర్ కిట్లు వంటివాటికి రూ.14వేల కోట్లు, వ్యవసాయ శాఖకు రైతుబంధు, రైతు బీమాలకు రూ.25వేల కోట్లకుపైగా కేటాయింపులు చేయనున్నారు.
ప్రధానంగా ఇరిగేషన్‌కు రూ.37వేల కోట్లకు పైగా కేటాయింపులకు అవకాశాలున్నాయని తెలిసింది. బడ్జెట్‌లో కాళేశ్వరం ఎత్తిపోతలకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ చెల్లింపులకు రూ.11వేల కోట్లు కేటాయిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రాజెక్టులకు భూ సేకరణ, పరిహారం, మార్జిన్ మనీకి కూడా కేటాయింపులు ఘనంగానే ఉండనున్నాయి. ఇందుకు రూ.5వేల కోట్లు కేటాయింపుల్లో ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డికి రూ.4వేలకోట్లు, కల్వకుర్తికి రూ.600కోట్లు, సీతారామా ఎత్తిపోతలకు రూ.1000కోట్లు, కరీనంగర్‌లో చేపడుతున్న వరద కాలువకు రూ.500కోట్లు, ఎస్సారెస్సీ ఆధునీకరణకు రూ.400కోట్లు కేటాయింపులు ఉండనున్నాయి.
ప్రధాన పథకాలకు నిధుల వరద పారనుంది. సబ్సిడీలు, దళితబంధు, రైతు బంధు, విద్యుత్ సబ్సిడీలు, వడ్డీలకు భారీగా వ్యయాలు పెరగనున్నాయి. ప్రస్తు ఏడాది వ్యవసాయినికి రూ.24254కోట్లు, రెండుపడక గదుల ఇండ్లకు రూ.12వేలకోట్లు, సంక్షేమ శాఖలకు రూ.31456కోట్లు, ఆర్ అండ్ బీకి రూ.23191కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11728కోట్లు, దళితబంధుకు రూ.17,700కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.22675కోట్లు, వైద్య ఆరోగ్యం రూ.11237కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.29,586కోట్లు కేటాయింపులు చేశారు. విద్యకు రూ.16043కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.10903కోట్లు కేటాయించారు. ఈ మొత్తాలు 2023-24లో మరింతగా పెరగనున్నాయి.