Saturday, November 23, 2024

Delhi | బడ్డెట్ నిరాశపరిచింది.. బీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, నామ విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ నిస్పృహలకు గురి చేసిందని బీఆర్‌ఎస్ ఎంపీలు విమర్శించారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అది చేశాం, ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ బడ్జెట్‌ను సొంత డబ్బాలా మార్చేశారని ఎంపీ నామా విమర్శించారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగాన్ని తలపించిందని,  కానీ ఏ వర్గాన్ని సంతృప్తి పర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు.

ఒక్క కొత్త సంక్షేమ పథకం గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్న ఆయన… ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరుకున్నాయని, నియంత్రణ చేసే దిశగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనా లేదని దుయ్యబట్టారు. పీఎం కిసాన్ సాయంపై రైతులకు నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు. తక్కువ కేటాయింపులు చేసి వ్యవసాయ రంగానికి, రైతులకు మొండి చేయి చూపారని అన్నారు.మొత్తంమీద ఎన్నికల ప్రచారానికి బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారే తప్ప దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని కేశవరావు, నామ నాగేశ్వరరావు కేంద్రంపై ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement