హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు యువకుడు బలయ్యాడు. నగరానికి చెందిన బీటెక్ విద్యార్ధి ఒకరు ఇటీవల గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో వారం రోజులకే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలిసి ఆసుపత్రిలో చేర్చించగా సదరు విద్యార్ధి ఎనిమిది రోజులు చికిత్స పొంది ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ కారణంగా మరణించిన తొలి కేసుగా నిలిచింది. అందుతున్న సమాచారం మేరకు బీటెక్ విద్యార్థితో పాటు గోవాకు మరో ఎనిమిది మంది వెళ్లినట్లు తెలిసింది. ఇందులో నలుగురు విద్యార్థులు, ఐదుగురు డీజేలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తొమ్మిది మంది కూడా డ్రగ్స్ తీసుకోవడంతో వీరందరినీ అధికారులు ఆసుపత్రిలో చేర్చించారు.
బీటెక్ విద్యార్థి రోజుకు మూడు సార్లు ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకోవడంతో అతని పరిస్థితి సీరియస్ అయిందని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ తీసుకున్న మొత్తం తొమ్మిది మందికి గత ఎనిమిది రోజులుగా చికిత్స అందిస్తున్నారు. మిగతా ఎనిమిది మంది పరిస్థితి నిలకడగానే ఉన్నా నల్లకుంట ప్రాంతానికి చెందిన విద్యార్థి మాత్రం మృతి చెందాడు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి #హదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ తొమ్మిది మంది బాగోతం వెలుగు చూసింది. నిందితుడు ప్రేమ్‌తో పాటు మృతి చెందిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకుని అమ్మేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగర పోలీసులు ప్రత్యేకంగా నార్కోటిక్ వింగ్‌ను ఏర్పాటు చేసి డీసీపీ నేతృత్వంలో డ్రగ్స్ పెడ్లర్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగానే పోలీసులు నల్లకుంట, జూబ్లిహిల్స్ పోలీసుస్టేషన్‌ల పరిధులలో పలువురు యువకులను అరెస్టు చేసి వారి నుంచి డగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని విచారించగా ఇటీవలే గోవా వెళ్ళిన యువకులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా, నల్లకుంట ప్రాంతంలో బీటెక్ విద్యార్థి ఒకరు డ్రగ్స్‌ను ఓవర్ డోస్ తీసుకుని అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. యువకుడితో పాటు గోవాకు వెళ్ళిన వారెవరని ఆరా తీసిన పోలీసులు వారిని కూడా గుర్తించి అందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకున్న యువకుడు మృతి చెందాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..