బెంగళూరు : నగదు కోసం గురుసిద్ధప్ప అనే వ్యక్తిని అపహరించి హత్య చేసిన ఘటన పెను సంచలనంగా మారింది. ఈకేసులో సంజయ్, ఆనంద్‌లను జ్ఞానభారతి ఠాణా పోలీసులు అరెస్టు చేశాక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. హత్య అనంతరం.. గురుసిద్ధప్ప దేహాన్ని చిన్న ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో కాకులకు, గద్దలకు, వన్యప్రాణులకు ఆహారంగా పడేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. గురుసిద్ధప్పను నిందితులు జనవరి ఒకటో తేదీన అపహరించారు. ఆయన భార్యకు ఫోన్ చేసి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. నగదు ఇచ్చిన తర్వాత మంచినబెలె అటవీ విభాగానికి అతన్ని తీసుకువెళ్లారు. మద్యం తాగి, అతనితోనూ తాగించారు. అతన్ని విడిచి పెడితే తమ విషయం బయట పడుతుందని హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి, అడవిలో కాకులు, గద్దలు, వన్య ప్రాణాలు సంచరించే ప్రాంతంలో అక్కడక్కడా చల్లారు. ఆ మరుసటి రోజు గోవాకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. అటవీ విభాగంలో దొరికిన కొన్ని శరీర భాగాలకు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు తిమ్మ, హనుమంతుల కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.