Saturday, November 23, 2024

మహిళా బిల్లుపై గళమెత్తిన బీఆర్‌ఎస్.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు గళమెత్తారు. మహిళా బిల్లుపై చర్చించాలంటూ మంగళవారం లోక్‌సభలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, మాలోత్ కవిత వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులు పట్టుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. లోక్‌సభ ప్రారంభం కాగానే ఎంపీలందరూ సీట్లలో నుంచి లేచి నిలబడి బిల్లుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభను తిరిగి బుధవారానికి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మహిళలు, మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల చిత్తశుద్ది లేదని, ఉంటే కచ్చితంగా పార్లమెంట్‌లో చర్చకు అవకాశం ఇచ్చేవారని అన్నారు. బిల్లు పాస్ అయ్యేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపల, బయట పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మరోవైపు అదానీ అంశంపై జేపీసీ వేయకుండా, ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

ఎంపీల శాంతి ర్యాలీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి-కేంద్ర ప్రభుత్వ నియంతృత్వం నశించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్‌తో సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నల్లచొక్కాలు ధరించి న్యూఢిల్లీలో రాత్రి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎర్రకోట నుంచి ప్రారంభమై ఇండియా గేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వ రద్ద నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే నినాదాలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. మార్గమధ్యంలో పోలీసులు బారీకేడ్స్ ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్స్‌ను తొలగించుకొని ముందుకు వెళ్లేందుకు ఎంపీలు ప్రయత్నించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె. కేశవరావు, లోక్‌సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు, ఎంపీలు కె.ఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement