Monday, November 25, 2024

Big Story | దేశమంతా విస్తరిస్తున్న బీఆర్‌ఎస్‌.. త్వరలో నాందేడ్​లో సభ, మహారాష్ట్ర నుంచి భారీగా చేరికలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్‌ ఉత్తర తెలంగాణ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, హన్మంతు షిండే, జోగురామన్న తదితరులు నాందేడ్‌లో పర్యటిస్తూ అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను సమన్వయం చేస్తున్నారు.

తాజాగా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పర్యటిస్తూ నాందేడ్‌ సభలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావాల్సిందిగా మహారాష్ట్ర వాసులను వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌తోనే రైతులకు, పేదలకు మంచి జరుగుతుందని, తెలంగాణలో ఈ వర్గాలకు ఇప్పటికే లబ్ధి జరుగుతోందని వారికి వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని కిన్వట్‌లో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేపశవ్యాప్తంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా కిణ్వట్‌లో ప్రజలు ఇంద్రకరణ్‌రెడ్డికి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను తమకు కూడా అమలు చేయాలని కోరారు.

- Advertisement -

నాందేడ్‌ సభకు అనుమతి…

నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బీఆర్‌ఎస్‌లోకి చేరికల సభకు పోలీసులు అనుమతిచ్చినట్లు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు. ఈమేరకు అనుమతి పత్రాన్ని ఆయన శనివారం పోలీసు వర్గాల నుంచి అందుకున్నట్లు చెప్పారు. సభకు అనుమతి వచ్చిన అనంతరం సభ జరిగే వేదిక వద్ద ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, హనుమంత్‌ షిండే, జోగు రామన్న, నాందేడ్‌ బీఆర్‌ఎస్‌ నేతలు కలిసి భూమి పూజ నిర్వహించారు. సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో పెద్ద ఎత్తున నేతలు చేరనున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో గురుద్వార సందర్శన అనంతరం సీఎం కేసీఆర్‌ అక్కడ జరిగే సభలో పాల్గొని స్థానిక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తారు. గత వారం మహారాష్ట్ర నుంచి పలువురు నేతలు బృందాల వారిగా హైదరాబాద్‌ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో వారందరినీ నాందేడ్‌లో జరిగే సభలోనే పార్టీలో చేరాలని సీఎం సూచించడంతో సభ సందర్భంగా వారు పార్టీలో చేరనున్నారు.

సరిహద్దు రాష్ట్రాలపైనే తొలుత ఫోకస్‌….

ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ వంటి తెలంగాణకు పొరుగున ఉన్న రాష్ట్రాలపైనే బీఆర్‌ఎస్‌ తొలుత ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలకు అవగాహన ఉండడంతో ఇక్కడ పార్టీని విస్తరించడం సులభమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ తొలిసభను ఖమ్మంలో నిర్వహించి సరిహద్దులో ఉన్న ఏపీ గ్రామాల నుంచి ప్రజలను సమీకరించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రాష్ట్రానికి మరో సరిహద్దులో ఉన్న మహారాష్ట్రపై ఫోకస్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ త్వరలో జరిగే సభ ద్వారా అక్కడి ప్రజలకు బీఆర్‌ఎస్‌ లక్ష్యాలను వివరించనుంది. అనంతరం కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లపైనా బీఆర్‌ఎస్‌ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement