హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార భారాస వర్సెస్ కాంగ్రెస్‌గా సీన్ మారుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారాస టార్గెట్‌గా ఆరోపణల పర్వానికి దిగారు. మరో వైపు గన్ పార్క్ వద్ద డబ్బు, మద్యంపై ప్రమాణ స్వీకారం పేరుతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని గులాబీ లీడర్లు కౌంటర్‌లకు దిగుతున్నారు.
మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో డబ్బు, మద్యం పంచనని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలను తెరమీదకు తెస్తున్నారు. కాంగ్రెస్‌లోని లొసుగులు అందరికి తెలుసంటూ రేవంత్‌పై ఎటాక్ చేస్తున్నారు. భారాస సైతం కాంగ్రెస్ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారన్న అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లేలా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో జరిగే సభల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు సీట్లు అమ్ముకున్న వాళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రచారంలో హస్తం తీరుపై విమర్శలు..
భారాస నేతలు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లిdకి గులామ్‌లము కాదు అంటూనే కాంగ్రెస్‌లోని అంతర్గత గొడవలను తెరమీదకు తెస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక నేతలే టార్గెట్‌గా విమర్శల పర్వాన్ని షురూ చేశారు. లోకల్‌గా ఉన్న ప్రధానాంశాలను తెర మీదకు తెస్తున్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని నేతల తీరును ఎండగట్టుతూనే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేశారు. అటు నిజామాబాద్, కరీంనగర్‌లో వార్ వన్ సైడ్ అయ్యేలా భారాస దూకుడును పెంచింది. కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ సభతో జోష్ సంతరించుకుంది.
నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నుంచి అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతుండటంతో క్లీన్ స్వీప్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం బతుకమ్మ సంబరాలతో ప్రచారాన్ని షురూ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాస్త గులాబీ నేతల దూకుడు తగ్గినట్లే కనిపిస్తున్నా రేవంత్ ప్రభావం లేకుండా చేసేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నా ఎంత వరకు సక్సెస్ అవుతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కొంత బెల్ట్ కాంగ్రెస్ హవాను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. భారాస దాన్ని అడ్డుకుంటోంది. ప్రచారం సందడి మొదలు పెట్టడంతో నేతలు స్లోగా దూకుడు పెంచుతున్నారు.