తెలంగాణా డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతంను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా ఉంటూ బీఆర్‌ఎస్ ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, మరోసారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించినట్లు సమాచారం.
స్పందించిన కేటీఆర్..
కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘కొంతకాలంగా ప్రభుత్వ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదు. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు. నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది’’. అని కేటీఆర్ పేర్కొన్నారు.