Sunday, November 17, 2024

అభివృద్ధి చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు.. కేంద్ర సర్కార్‌పై బీఆర్‌ఎస్ విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయన, వారి కుటుంబంపై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్‌ను దామాషా ప్రకారం అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందించారని హర్షం వ్యక్తం చేశారు. దళితబంధు పథకాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు రూ.36 వేల కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్  చేపట్టారని చెప్పుకొచ్చారు. బీసీలను అవమానించేలా 70 వేల కోట్లతో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే… బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ 2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని, బడ్జెట్ కేటాయింపులను చూసి కేంద్ర ప్రభుత్వం సిగ్గు పడాలని లింగయ్య యాదవ్ అన్నారు. కేంద్రం బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలను విస్మరించిందని, వ్యవసాయానికి, ఉపాధి హామీ పథకాలకు నిధుల్లో కోత పెట్టిందని ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు, పార్టీల నాయకులు తెలంగాణ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఏ విధంగా అయితే 24 గంటల కరెంట్ ఇస్తున్నామో దేశంలో కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆయనను చూసి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలు నేర్చుకోవాలని ఎంపీ లింగయ్య  ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement